లూసీయానాలోని ఒక పెట్రోల్ బంకులోకి యస్‌యూవీ కారు ఒకటి వచ్చి ఆగింది. పెట్రోల్ కొట్టిద్దామని తన పెంపుడు కుక్క చువావాను కారులోనే ఉంచి యజమాని బయటకు దిగి సిబ్బందితో మాట్లాడుతున్నారు. ఈలోగా కారు ఒక్కసారిగా స్టార్ట్ అయ్యి బ్యాక్‌వర్డ్ డైరక్షన్‌లో పక్కనే ఉన్న 4- లేన్ల మెయిన్ రోడ్డుమీదకు వెళ్లింది. దీంతో అవాక్కయిన కారు యజమాని కారు వెనకాలే పరిగెత్తారు. కారు డోరు తెరిచే ప్రయత్నంలో ఆమె కిందపడిపోయారు. దేవుడి దయ వల్ల ఆ సమయంలో వాహనాలు ఏవీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చివరకు ఎదురుగా ఉన్న మరో గ్యాస్ స్టేషన్ బారీకేడ్లను ఆనుకొని కారు నిలిచిపోయింది. కాగా కారులో ఉన్న చుహాహా క్షేమంగానే ఉంది.
ఈ ఘటన లూసీయానాలో గత శుక్రవారం చోటుచేసుకుంది. అయితే ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోనూ లూసియానా పోలీసులు ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన వారంతా ఫన్నీకామెంట్లు పెట్టారు. ' ఈ కుక్క మహా తెలివైనదని, కారును స్టార్ట్ చేసి నడిపిందని' పేర్కొన్నారు. మరికొందరు మాత్రం చువావా క్షేమంగా బయటపడినందుకు సంతోషిస్తున్నట్లు కామెంట్లు పెట్టారు.
నెటిజన్ల కామెంట్లపై స్పందించిన పోలీసులు అసలు విషయం వెల్లడించారు. కారులో ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా బ్రేక్ వేయకుండానే ఆటోమెటిక్ గేర్లను మార్చుకోగలదని, అందుకే కారు ఒక్కసారిగా బ్యాక్‌వర్డ్ డైరక్షన్‌లో మూవ్ అయిందని తెలిపారు. ఆ సమయంలో వాహనాలు ఏవి రాకపోవడం, అలాగే ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడం నిజంగా అద్బుతమని పేర్కొన్నారు. ' కార్లలో తమ పెంపుడు జంతువులను వదిలి వెళ్లేవారికి ఈ ఘటన ఒక చక్కటి ఉదాహరణ అని' పోలీసులు వెల్లడించారు. కాగా, ఇలాంటి ఘటనే గత గురువారం ఫ్లోరిడాలో జరిగింది. తన పెంపుడు కుక్క బ్లాక్ లాబ్రాడర్‌ను కారులోనే ఉంచి పార్క్ చేసి వెళ్లాడు. ఆ తర్వాత ఆటోమెటిక్ మోడ్ ఆన్ అయి కారు ఒక గంట పాటు వృత్తాకారంలో తిరగడం వైరల్‌గా మారింది. ఈ రెండు ఘటనల్లో పెంపుడు కుక్కలు ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment