నాయకుల పిల్లలను చంపేస్తాం!
పెషావర్లో స్కూలుపిల్లలను దారుణంగా హతమార్చిన తర్వాత.. ఇక తమ తదుపరి లక్ష్యం రాజకీయ నాయకుల పిల్లలేనని పాకిస్థాన్ తాలిబన్లు ప్రకటించారు. వాళ్లలో ప్రధాని నవాజ్ షరీఫ్ పిల్లలు కూడా ఉంటారని హెచ్చరించారు. ఈ విషయమై తెహరీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ టాప్ కమాండర్ అని భావిస్తున్న మహ్మద్ ఖరసానీ నుంచి పాక్ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు ఓ లేఖ అందింది. ప్రధాని నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యులు సహా పలువురు నాయకుల పిల్లలను తాము చంపేస్తామని అందులో పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఉరి తీయాలని పాక్ ప్రభుత్వం, సైన్యం నిర్ణయించడంతో దాన్ని అడ్డుకోడానికి ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నట్లు పాక్ నిఘావర్గాలు భావిస్తున్నాయి.
అయితే అసలు ఆ లేఖ నిజమైనదా.. కాదా అనే విషయాన్ని పరిశీలించడంలో పాక్ ఉన్నతాధికారులు తలమునకలయ్యారు. పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల అడుగు జాడల్లోనే నడుస్తారని, అందువల్ల నాయకుల పిల్లలను ముందుగా చంపేస్తామని ఆ లేఖలో చెప్పారు. తాజాగా పాకిస్థాన్ ఉరిశిక్ష విధించిన ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకరైన ఒమర్ షేక్.. గతంలో కాందహార్ విమాన హైజాక్ కేసులో నిందితుడు. డేనియల్ పెర్ల్ హత్య నేరం కూడా అతడిపై ఉంది.