అందమైన రూపం... అంతకు మించి ఆకట్టుకునే హెయిర్‌కట్... తూటాల్లా పేలే మాటలు... భావోద్వేగాలు రెచ్చగొట్టేలా చేసే ప్రసంగాలు... వాటి వెనుక కాస్తో కూస్తో కనిపించే నిజాయితీ ఆయనకు పేరు ప్రతిష్టలు తెచ్చిపెడితే, దూకుడు స్వభావం, ఆవేశాన్ని అణచుకోలేని తత్వం, ప్రత్యుర్థులతో ఘర్షణలకు దిగే స్వభావం ఇమ్రాన్‌ను వివాదాస్పద వ్యక్తిగా మార్చాయి. 1952 అక్టోబర్ 5న పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జన్మించిన ఇమ్రాన్‌ఖాన్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ చేశారు. 1976లో పాక్ జాతీయ జట్టులో స్థానం పొందారు. ఫాస్ట్ బౌలర్‌గా ఎంతో రాణించిన ఇమ్రాన్ 1992లో వరల్డ్‌కప్ సాధించిన తరువాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు.
కేన్సర్‌తో మరణించిన తల్లి షౌకత్ ఖానమ్ స్మారకార్థం ఆమె పేరుతో ఆసుపత్రిని ప్రారంభించి దేశంలో కేన్సర్‌పై అవగాహన పెంచే ప్రయత్నాలు చేశారు. పంజాబ్ రాష్ట్రం మియాన్‌వాలీ జిల్లాలో సాంకేతిక విద్యాలయాన్ని స్థాపించారు. 1996లో అందరికీ న్యాయం నినాదంతో పాకిస్తాన్ తెహ్రీక్– ఎ–ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీని స్థాపించారు. అయితే పీటీఐ తొలి ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంలోనే గెలుపొందింది. పెరిగిపోతున్న అవినీతికి నిరసనగా 2008 ఎన్నికల్ని బహిష్కరించిన ఇమ్రాన్... 2011 నాటికి అనూహ్యంగా పుంజుకున్నారు.
అవినీతిపరులపై ఆయన చేసే ఉద్వేగభరిత ప్రసంగాలు వినేందుకు జనం వెల్లువెత్తారు. పాక్‌లోని ప్రధాన పార్టీలైన నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్), బేనజీర్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)ని ఢీకొట్టి బలమైన మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగారు. 2013కల్లా పీటీఐ 35 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ప్రధానంగా ఆయన నవాజ్ షరీఫ్ అవినీతిపైనే న్యాయపోరాటం చేసి చివరకు ఆయన జైలు పాలయ్యేలా చేశారు.
డొనాల్డ్ ఖాన్?
పాకిస్తాన్‌లోని ఒక వర్గం ఇమ్రాన్‌ఖాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోలుస్తున్నారు. డొనాల్డ్ ఖాన్, ఇమ్రాన్ ట్రంప్ అని పిలుస్తూ సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే ఇమ్రాన్ విజయం ఊహించలేనిది. అమెరికాలో మాదిరిగానే పాకిస్తాన్ ప్రజల్లో స్పష్టమైన చీలిక కనిపించిన సమయంలో ఇమ్రాన్ పార్టీ అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంది.
అందుకే ఆయన విజయాన్ని కొందరు లెక్కలోకి తీసుకోవడం లేదు. విపక్ష నేతగా ఆయన పార్లమెంటుకు హాజరైంది చాలా తక్కువ. పైగా పరిపాలనాంశాలపై ఎప్పుడూ దృష్టి సారించింది లేదు. జనంలో ఉంటూ భారీ ర్యాలీలు నిర్వహిస్తూనే ఎక్కువ సమయం గడిపారు. అధికారపక్ష నేతల్ని ఎండగట్టడమే పనిగా పెట్టుకున్నారు.
పాక్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టగలరా..?
ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా ఉంది. అంతర్జాతీయంగా కరెన్సీ విలువ రోజురోజుకూ పడిపోతోంది. విదేశీ మారకపు నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోయాయి. 2,500 కోట్ల డాలర్ల వాణిజ్య లోటు వెంటాడుతోంది. జీడీపీలో 70 శాతం అప్పులు తీర్చడానికే సరిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఇమ్రాన్‌ఖాన్ దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడం ఆషామాషీ కాదు. పైగా విదేశీ వ్యవహారాల పరిస్థితీ అంతంతమాత్రమే. పాక్‌ను తాలిబన్ల అడ్డాగా మార్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు.
సైన్యం సహకారంతో తాలిబన్లు కాబూల్ వైపు మళ్లేలా చర్యలు తీసుకోగలగాలి. ఇక భారత్‌తో సంబంధాలు ఎప్పుడూ ఉద్రిక్తతల్ని పెంచే అంశమే. దానిని సమర్థంగా ముందుకు తీసుకువెళ్లగలగాలి. చైనా నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడర్‌లో భాగంగా పాక్‌లో 6,200 కోట్ల డాలర్లు పెట్టుబడి పెడుతోంది. ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించే బాధ్యత కూడా కొత్త ప్రభుత్వంపైనే ఉంది. కోటి ఉద్యోగాలు కల్పిస్తానని, నిరుపేదలకు 50 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తానంటూ చేసిన ఎన్నికల హామీలను నిలబెట్టుకోగలగాలి.
ప్రేమాయణాలు, పెళ్లిళ్లు..
ఇమ్రాన్‌ఖాన్ జీవితంలో ప్రేమాయణాలు, పెళ్లిళ్లు తక్కువేం కాదు. క్రికెట్‌లో స్టార్‌గా ఎదుగుతూనే ఇమ్రాన్ ప్లేబాయ్‌గా పేరుగాంచారు. స్పోర్ట్స్ కార్లలో తిరుగుతూ లగ్జరీ లైఫ్ అనుభవించారు. లేడీ లిజా కేంబెల్, సుసన్నా కాన్‌స్టాంటైన్ వంటి మోడల్స్‌తో ప్రేమాయణం నడిపారు. లండన్ నైట్ క్లబ్బుల్లో సూపర్ మోడల్స్‌తో సందడి చేస్తూ మీడియా కంట చాలా సార్లు పడ్డారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. బ్రిటన్ బిలయనీర్ కుమార్తె, ప్రిన్సెస్ డయానా ప్రాణ స్నేహితురాలైన జెమీమా గోల్డ్ స్మిత్‌ను 1995లో పెళ్లి చేసుకున్నారు.
వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తొమ్మిదేళ్లు కాపురం చేశాక మనస్పర్థల కారణంగా 2004లో విడాకులు తీసుకున్నారు. 2015లో టీవీ యాంకర్ రెహామ్‌ఖాన్‌ను రెండోసారి పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనం రేపింది. పది నెలల్లోనే వారి బంధం విడాకులకు దారి తీసింది. ముచ్చటగా మూడోసారి తన ఆధ్యాత్మిక గురువు బష్రా మనేకను పెళ్లాడారు. ఈ బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగేలా కనిపించడం లేదు. మనేక, తన మొదటి భర్తతో కన్న బిడ్డ ప్రస్తుతం వీళ్లతోనే ఉంటున్నాడు.
ఇది ఇమ్రాన్‌కు నచ్చకపోవడంతో వారిద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు నెలకొన్నాయన్న గుసగుసలైతే వినిపిస్తున్నాయి.
ముందున్నది ముళ్లదారి..
మెజారిటీకి కొన్ని సీట్ల దూరంలో నిలిచిన ఇమ్రాన్‌ఖాన్... ఇతరుల మద్దతుతో ప్రధాని పీఠాన్ని అధిరోహించడం కష్టమైన పనేం కాకున్నా దాన్ని నిలబెట్టుకోవడం ఆయన ముందున్న అతిపెద్ద సవాల్. ఎన్నికల్లో రిగ్గింగ్‌తోనే ఇమ్రాన్ గెలిచారంటూ ఆరోపణలు గుప్పిస్తున్న విపక్ష పార్టీలు కోర్టుకెక్కడానికి సిద్ధమవుతుండగా ఏ విచారణకైనా సిద్ధమంటూ ఇమ్రాన్ సవాల్ చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో సంకీర్ణ సర్కార్‌ను నెగ్గుకు రావడం, సైన్యంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే సైన్యం కనుసన్నల్లో నడుస్తారన్న ముద్ర కనపడకుండా చూసుకోవడం ఇమ్రాన్ ముందున్న మరో చాలెంజ్. ఎన్నికల్లో విజయానికి సైన్యానికి దగ్గరైన ఆయన.. ఎన్నికల హామీలు నెరవేర్చడానికి సొం తంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. ఈ విషయం లో ఇమ్రాన్ ఎలా ముందుకు సాగుతారో చూడాలి.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment