
అక్కడ కండోమ్ యాడ్‌పై నిషేధం!
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఎయిడ్స్ వ్యాధి గురించి బహిరంగంగా మాట్లాడటంపై ఇప్పటికీ ఆంక్షలు ఉన్నాయి. తాజాగా కండోమ్ వాణిజ్య ప్రకటనపై నిషేధం విధించడం ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నది పాకిస్థాన్ దినపత్రిక ఒకటి తెలిపింది. 'ఎయిడ్స్ గురించి మాట్లాడుదాం' అంటూ ద న్యూస్ ఇంటర్నేషనల్ దినపత్రిక ఒక సంపాదకీయం రాసింది. ఎయిడ్స్ సమస్య గురించి చర్చించడంలో పాకిస్థాన్ ఎప్పుడు సరిగ్గా వ్యవహరించడంలేదని, తాజాగా కండోమ్ యాడ్‌పై విధించిన నిషేధం.. కీలకమైన ఈ సమస్య పరిష్కారానికి నిరాకరిస్తున్న వైనాన్ని చాటుతున్నదని ఆ పత్రిక పేర్కొంది.
'పాకిస్థాన్‌లో ఎయిడ్స్ సమస్య భారీగానే ఉందని ఒప్పుకోవడానికి సాధారణంగా ఎవరూ ముందుకురావడం లేదు. దేశ జనాభాలో 0.1శాతం మంది పెద్దలకు ఈ వ్యాధి సోకినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దాదాపు 97వేలమంది ఈ వ్యాధి బారిన పడ్డట్టు ప్రభుత్వం, యూనిసెఫ్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి' అని పత్రిక వివరించింది. మాదక ద్రవ్యాలు ఇంజెక్ట్ చేసుకునే వర్గాలు, సెక్స్ వర్కర్లు, దూరప్రాంతాలకు వెళ్లే ట్రక్కు డ్రైవర్లలో ఈ సమస్య తీవ్రత అధికంగా ఉందని తెలిపింది.