ఐరోపాలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.స్వీడన్‌లో కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయి. జపాన్‌లో ఎండల ధాటికి జనం ప్రాణాలు కోల్పోతూ ఉంటే.. అమెరికన్లూ ఉక్కబోత తట్టుకోలేకపోతున్నారు. ఇక సౌదీ అరేబియా గురించి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు ఆ దేశం,ఈ దేశం అని కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు భానుడి ప్రతాపానికి అల్లాడిపోతున్నాయి. 2018 సంవత్సరం ఎండల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
ఎందుకీ ఎండలు ? ఈ ఏడాదే ఎందుకింత మంటలు ?
ఎండలు మండిపోయేందుకు పలు కారణాలున్నాయని రీడింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫసర్ లెన్ షాఫ్రే అంటున్నారు. వాతావరణంలో గాలి పీడనం ఎక్కువగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు పెరగడం సహజం. బలంగా వీచే గాలుల కారణంగా కొద్దికాలంలోనే పీడనం తగ్గిపోయి వాతావరణం చల్లబడుతూంటుంది. అయితే ఈ ఏడాది గాలులు చాలా మందగమనంతో వీస్తూండటం వల్ల అధిక పీడన పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగాయి. ఫలితంగా బ్రిటన్ తదితర దేశాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం లేదు. గాలులు ఎంత వేగంతో వీస్తాయన్నది ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాల్లోని ఉష్ణోగ్రతల మధ్య ఉన్న తేడాపై ఆధారపడి ఉంటుంది. వేగం తక్కువగా ఉండటంతో ఈ ఏడాది దక్షిణార్ధ గోళం నుంచి బయలుదేరిన గాలులు యూరోపియన్ దేశాలకు చేరేందుకు ఎక్కువ కాలం పడుతోంది. అంతేకాకుండా దిశకూడా మార్చుకోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది.
భూతాపోన్నతీ కారణమే.. పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం వల్ల భూమి క్రమేపీ వేడెక్కుతోందని మనకు తెలుసు. కొన్నిదేశాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండేందుకు ఈ భూతాపోన్నతి కూడా కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉత్తర అట్లాంటిక్ సముద్ర ఉపరితలంపై వస్తున్న అనూహ్య మార్పుల కారణంగా బ్రిటన్, ఐర్లండ్ వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా ఏర్పడే ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి లానినో పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ వచ్చేసరికి లానినో బలహీనమై ఎల్‌నినో పరిస్థితులు వచ్చేశాయి. దీంతో బ్రిటన్‌లో పొడి వాతావరణం నెలకొని ఉక్కబోత భరించలేని స్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు ప్రపంచంలో 1976 సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా రికార్డులకెక్కింది. ఈ ఏడాది వివిధ దేశాల్లో ఇదే పరిస్థితి కొనసాగితే ఆ నాటి పరిస్థితే మళ్లీ పునరావతమవుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూకేలో 400 ఏళ్ల రికార్డులు బద్దలు
ఇంగ్లండ్‌లో ఎండలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే గత నాలుగు వందల ఏళ్ల రికార్డులు బద్దలైపోయాయి. 1600 సంవత్సరం తర్వాత ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు చేరుకోవడం ఈ ఏడాదే.. ఎప్పుడూ 20 నుంచి 25 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఇంగ్లండ్‌లో ఈ వారం ఏకంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై జనాల్ని బెంబేలెత్తిస్తోంది. స్వీడన్‌లో ఈ శతాబ్దంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదై కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. గత కొన్ని రోజులుగా స్వీడన్‌లో ఉత్తరాన ఉన్న లాప్‌ల్యాండ్ నుంచి దక్షిణాదిన ఉన్న గోటాల్యాండ్ వరకు 44 ప్రాంతాల్లో అడవులు దగ్ధమవుతున్నాయి. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో రికార్డు స్థాయిలో 38 డిగ్రీల సెల్సియస్ నమోదైతే సౌదీ అరేబియాలో 46 డిగ్రీలు దాటి పోయాయి. జపాన్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోవడంతో ఎండ వేడికి తట్టుకోలేక ప్రజలు ప్రాణాలే కోల్పోతున్నారు. గత వారంలోనే 65 మంది మరణిస్తే, మరో 22 వేల మంది వడదెబ్బ తగిలి ఆస్పత్రి పాలయ్యారు. దీంతో ఆ దేశం ఎండల్ని ఒక ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించింది.. ప్రపంచ దేశాల్లో ఈ ఎండల తీవ్రత ఆగస్టు నెలాఖరువరకు కొనసాగే అవకాశాలున్నాయని గ్లోబల్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్, నేషనల్ ఓషన్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్లు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment