టెక్సాస్ : అమెరికాలోని టెక్సాస్‌లో ఓ చర్చిలో ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగి కెల్లీ విచక్షణరహిత కాల్పులకు తెగబడి 26 మంది అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఓ తల్లి తన పిల్లల్ని రక్షించుకునేందుకు వారికి రక్షణ కవచంగా నిలిచి ప్రాణాలు కోల్పోయినా అమ్మగా అందరి హృదయాల్ని గెలిచారు. ఇద్దరు పిల్లల ప్రాణాలు కాపాడగా, మరో ఇద్దరు చిన్నారులు దుండగుడి కాల్పులకు బలైపోయారు.
సదర్‌లాండ్ స్ప్రింగ్స్‌లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో సుమారు 50 మంది ప్రార్ధనల్లో ఉండగా నల్ల దుస్తుల్లో వచ్చిన నిందితుడు కెల్లీ విచక్షణా రహితంగా కాల్పులు జరపడం ప్రారంభించాడు. చర్చిలో తన పిల్లలు బ్రూక్ (5), రైలాండ్ (5), ఎమిలీ, రిహన్నా (9)లతో పాటు జోయాన్ వార్డ్ అనే మహిళ ఉన్నారు. తన పేగుబంధాలను ఎలాగైనా దుండగుడి కాల్పుల నుంచి రక్షించుకోవాలనుకున్నారు వార్డ్. ఉన్మాది తమ వైపునకు రావడాన్ని గమనించిన ఆ తల్లి, ఎమిలీ, రైలాండ్, బ్రూక్‌లకు రక్షణ కవచంగా అడ్డుగా నిలవగా తుపాకీ తూటాలు ఆమె గుండెను చీల్చుకుంటు వెళ్తున్నాయి.
తన పిల్లల్ని కాపాడుకోవాలన్న ఆరాటంలో తన ప్రాణాలు పోయిన పరవాలేదని భావించారు ఆ మాతృమూర్తి. కానీ ఈ దారుణఘటనలో తల్లి వార్డ్‌తో పాటు కూతుళ్లు బ్రూక్, ఎమిలీ మృతిచెందారు. వార్డ్, బ్రూక్‌లు చర్చిలోనే చనిపోగా, తీవ్రగాయాలపాలైన ఎమిలీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించింది. కాల్పులు ప్రారంభం కాగానే తన పెద్ద కూతురు రిహన్నాను ఫ్లోర్ మీదకి నెట్టి అలాగే ఉండాలని తల్లి వార్డ్ చెప్పడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. వార్డ్ కుమారుడు రైలాండ్ కు బుల్లెట్ గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాలను వీరి ఫ్యామిలీ ఫ్రెండ్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment