టెక్సాస్ కాల్పుల మృతులకు నివాళిగా స్థానికుల క్యాండిల్ ర్యాలీ
టెక్సస్: ఇటీవల అగ్రరాజ్యంలో జరిగిన రెండు ఉగ్రదాడులను మరిచిపోకముందే మరో దారుణం సంభవించింది. టెక్సస్‌లోని ఒక చర్చి నెత్తురోడింది. సుదర్లాండ్ స్ప్రింగ్స్ ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిపై ఆదివారం ఉదయం ఒక సాయుధుడు విచక్షణా రహి తంగా కాల్పులు జరిపాడు. దీంతో 27 మంది బలయ్యారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఐదేళ్ల చిన్నారి నుంచి 70 ఏళ్ల పైబడిన వయోధికులు కూడా ఉన్నారు. ఒక గర్భిణి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
సైనిక దుస్తుల్లో వచ్చిన దుండగుడు చర్చిలోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరపగా అతడు తన తుపాకీని చర్చిలోనే వదిలేసి పారిపోయాడు. చర్చికి సమీపాన గల గ్వాడాలుపే కౌంటీలో తన వాహనంలోనే శవమై కనిపించాడు. పోలీసుల కాల్పుల్లో చనిపోయాడా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇతణ్ని 26 ఏళ్ల డెవిన్ పి. కెల్లీగా గుర్తించారు. మృతుడు శాన్ అంటానియో సమీపంలోని కోమల్ కౌంటీకి చెందినవాడని అధికారులు తెలిపారు. ఇతడు గతంలో ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసినట్టు సమాచారం. అయితే ఇది ఉగ్రవాదదాడి కాదని అమెరికా ప్రకటించింది.
ఇదో భయంకరమైన దుశ్చర్య: ట్రంప్
టెక్సస్ దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఇదో భయంకరమైన దుశ్చర్య అని పేర్కొన్నారు. దేవుడి చెంతనే ఇలాంటి ఘోరం జరగడం చాలా బాధకరమని ట్రంప్ అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అమెరికన్లు అంతా ఏకమై.. బాధితులకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. పరిస్థితిని అక్కడి నుంచే సమీక్షిస్తున్నానని, టెక్సస్ రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు. తుపాకుల నియంత్రణపై విలేకరులు ప్రశ్నించగా, సమస్య అది కాదని, అమెరికాలో మానసిక సమస్యలు అధికమన్నారు. కెల్లీ కూడా మానసిక సమస్యలతో ఇబ్బందిపడేవాడని ట్రంప్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment