తాగొచ్చారో.. నడపనీయదు
న్యూయార్క్: తాగి డ్రైవింగ్ చేసే మందు బాబులు.. ముందుముందు మీ పప్పులు ఉడకవు. అవసరమైతే ఫైన్ కట్టేసి వెళ్లిపోతామని మీరనుకున్నా అది సాధ్యం కాదు. ఎందుకో తెలుసా మీ కార్లు ఆగిపోతాయి. అది డ్రంక్ అండ్ డ్రైవ్ తనఖీ బృందాల వల్ల కాదాండోయ్ మీ కార్ల వల్లే ముందుకు కదల్లేరు. ఎందుకంటే తాగి కారు నడపాలని ప్రయత్నిస్తే అవి కదలకుండా మొరాయిస్తాయని, హెచ్చరిస్తాయని అంటున్నారు మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు.
వారు ప్రత్యేకంగా తయారు చేసిన పరికరం ఒకటి కారు నడిపే వ్యక్తి రక్తంలో ఆల్కాహాల్ లెవల్ దాటితే వెంటనే కారు ఇంజిన్కు సిగ్నల్ ఇచ్చి ముందుకు వెళ్లకుండా నియంత్రి స్తుంది. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బయటపడొచ్చు. గత పదిహేనేళ్లుగా అమెరికాలో కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలన్నింటిలో వారు తయారు చేసిన ఈ పరికరాన్ని అమర్చగా గతంలో జరిగిన ప్రమాదాలకన్నా 85శాతం ప్రమాదాలు తగ్గిపోయాయంట. దాదాపు 59,000 మరణాలు సంభవించకుండా నియంత్రించినట్లు వారు వెళ్లడించారు. ఈ పరికరాల పనితీరు సమర్థంగా ఉండటంతో మరో మూడేళ్లపాటు వీటిని ఉత్పత్తి చేసి మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ప్రచురించారు.