25 ఏళ్లకే 1390 కోట్ల డాలర్లకు వారసుడు
లండన్: బ్రిటన్‌లో వెస్ట్‌మినిస్టర్ ఏడవ డ్యూక్‌గా 25 ఏళ్ల హగ్ రిచర్డ్ లూయీ గ్రాస్‌వెనర్ ఎంపికై పదవీ బాధ్యతలు స్వీకరించారు. తన తండ్రి ఆరవ డ్యూక్ జెరాల్డ్ లావెండిష్ గ్రాస్‌వెనర్ (64) ఇటీవల మరణించడంతో తండ్రి నుంచి వారసత్వంగా ఆయనకు ఈ పదవి దక్కింది. బ్రిటన్ మహారాణి విక్టోరియా 1874లో ఈ పదవిని సృష్టించిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి గ్రాస్‌వెనర్ కుటుంబ సభ్యులే వంశపారంపర్యంగా ఈ పదవిని ఏలుతున్నారు.
పాతికేళ్ల హగ్ రిచర్డ్‌కు తండ్రి మరణంతో వారసత్వంగా డ్యూక్ పదవీ బాధ్యతలతోపాటు 1390 కోట్ల డాలర్ల ఆస్తి సంక్రమించింది. దీంతో ఆయన బ్రిటన్‌లో మూడవ అతిపెద్ద సంపన్నుడిగా, ప్రపంచంలో 68 అతిపెద్ద సంపన్నుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. 2012లో జరిగిన ఆయన 21వ పుట్టిన రోజుకు 80 లక్షల డాలర్లు ఖర్చు పెట్టారనే ప్రచారం ఉంది. న్యూకాజిల్ సిటీ యూనివర్శిటీలో కంట్రీసైడ్ మేనేజ్‌మెంట్ కోర్సు చదవిన హగ్ అనంతరం ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో పీజీ చేశారు. తొలుత కుటుంబ ఎస్టేట్ వ్యవహారాలు చూసిన హగ్ మొన్నటి వరకు కుటుంబ కంపెనీల్లోనే అకౌంట్ మేనేజర్‌గా పనిచేశారు.
హఠాత్తుగా 1390 కోట్ల డాలర్లకు యజమాని అయినందున హగ్ ఆదాయం పన్ను చెల్లిస్తారా, లేదా? అన్న అంశం గత కొన్ని రోజులుగా బ్రిటన్ పౌరుల్లో చర్చనీయాంశం అయింది. అయితే కుటుంబ ఎస్టేట్‌లు అన్నీ ట్రస్టీల ఆధ్వర్యంలో నడుస్తున్నందున ఎలాంటి ఆస్తి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని హగ్ కుటుంబ న్యాయవాదులు తెలియజేస్తున్నారు. చెషైర్‌లో పదివేల ఎకరాల ఎస్టేట్‌తోపాటు మేఫేర్, బెల్‌గ్రానియాలోని 300 ఎకరాలు ఇప్పుడు ఏడవ డ్యూక్ హగ్‌కు సంక్రమించాయి. ఆయనకున్న ఇద్దరు అక్కా చెల్లెళ్లకు ట్రస్టీల నుంచి కొంత ఆస్తి పంపకాలు జరుగుతాయని కుటుంబ న్యాయవాదులు తెలిపారు.