
ఊదా బంగాళదుంప!
అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పోషకాలతో నిండిన సరికొత్త బంగాళదుంప వంగడాన్ని సృష్టించారు. ఊదా రంగులో ఉండే ఈ సరికొత్త ఆలుగడ్డల్లోని పోషకాలు దానిమ్మ, బ్లూబెర్రీలకు ఏమాత్రం తీసిపోవని శాస్త్రవేత్తలు అంటున్నారు. కొలరాడో శాస్త్రవేత్తలు తమ సీఎస్‌యూ పొటాటో ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ఎరుపు, పసుపు, తెల్ల బంగాళదుంపల్ని సృష్టించారు. తాజాగా అభివృద్ది చేసిన ఊదా బంగాళదుంపల్లో అత్యధిక మోతాదులో యాంటీయాక్సిడెంట్లు ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
దీంతోపాటు విటమిన్ సీ, ఫోలిక్ యాసిడ్, ఖనిజాలు, పొటాషియం, ఇనుము, జింక్ వంటి పోషకాలూ మెండుగా ఇందులో ఉంటాయని చెబుతున్నారు. ఈ పోషకాలను తరచూ తీసుకోవడం ద్వారా కేన్సర్‌తోపాటు గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చునన్నది తెలిసిందే. అంతేకాదు... బంగాళదుంపల్ని వేయించినా, ఓవెన్‌లో బేక్ చేసినా దాంట్లో వృద్ధి చెందే కేన్సర్ కారక రసాయనం ఆక్రిలామైడ్ కొత్త వంగడంలో చాలా తక్కువగా ఉంటుందట. దీంట్లో ఉండే ఫైటో కెమికల్స్ మధుమేహ వ్యాధిగ్రస్తుల కళ్లలో శుక్లాలు ఏర్పడకుండా నిరోధిస్తాయట.