జెనివా : ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ప్రాణాంతక వైరస్ ‘కోవిడ్–19’ బారిన పడకుండా తప్పించుకోవాలంటే ఒళ్లంతా ఆల్కహాల్ పోసుకుంటే సరి అని, అల్లం తింటే అల్లంతా దూరాన ఉంటుందని, ఎలక్ట్రిక్ డయ్యర్ కింద చేతులు ఆరబెట్టుకున్నా వైరస్ హరీమంటుందని, రేడియేషన్‌ను విడుదల చేసే యూవీ లైట్లతో ఈ వైరస్‌ను అరికట్టవచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న చిట్కాలు, పద్ధతులేవీ కోవిడ్–19 ముందు పనిచేయవని ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం నాడు ఓ ప్రకటనలో తేల్చి చెప్పింది. తప్పుడు సమాచారాన్ని, కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేసినట్లయితే కోవిడ్ కేసులు మరింత పెరగుతాయంటూ నార్విచ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ పాల్ హంటర్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఎక్కువవడం గమనార్హం. (కోవిడ్ : ఫ్రాన్స్‌లో చైనా పర్యాటకుని మృతి)
ఉడకబెట్టిన అల్లం నీళ్లతో వైరస్‌ను అరికట్టవచ్చంటూ ఫేస్‌బుక్ షేరింగ్‌ను అడ్డుకున్నారు. అల్లంలో బ్యాక్టీరియాను అరికట్టే కొన్ని గుణాలు ఉన్నప్పటికీ ఈ వైరస్‌ను నిరోధించగలిగే లక్షణాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.నువ్వుల నూనెను ఒళ్లంతా పూసుకోవడం వలన లాభం లేదని, నోటి ద్వారానో, ముక్కు ద్వారానో వైరస్ సోకకుండా అది కాపాడలేదని తెలిపింది. కోవిడ్‌ను చంపేసే లక్షణాలు కూడా నువ్వుల నూనెలో లేవని స్పష్టం చేసింది. ఈ ప్రాణాంతక వైరస్ ప్రధానంగా వైరస్ సోకిన రోగి పక్కనున్నప్పుడు, ఆ రోగి తుమ్మడం వల్ల, దగ్గడం వల్ల వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment