
వాషింగ్టన్ : తన చాకచక్యంతో ఓ మహిళా క్లర్కు దొంగోడిని పరుగులు పెట్టించింది. తన సాహసంతో.. అతడు ఎత్తుకుపోయిన సొమ్ము తిరిగి యజమానికి చేరేలా చేసింది. ఈ ఘటన కెంటకీలోని ఓ హోటల్‌లో చోటుచేసుకుంది. వివరాలు... కోరీ ఫిలిప్స్ అనే వ్యక్తి ఓ హోటల్‌లో చొరబడ్డాడు. కౌంటర్ వద్ద ఎవరూ లేకపోవడంతో డబ్బులు కొట్టేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో అక్కడికి హోటల్ క్లర్కు రావడంతో ఆమెను తుపాకీతో బెదిరించి... సొమ్ము మొత్తం తన చేతిలో పెట్టాల్సిందిగా ఆదేశించాడు.ఈ క్రమంలో సదరు మహిళ ఏమాత్రం భయపడకుండా కౌంటర్‌లో ఉన్న డబ్బు తీసి ఫిలిప్స్‌కు చూపించింది. అనంతరం అతడిపై డబ్బులను విసురుతూ వాటిని కిందపడేలా చేసింది. అంతేగాకుండా డబ్బు భద్రపరచుకునేందుకు అతడికి ఓ కవర్ కూడా ఇచ్చింది. దీంతో క్లర్కు తనను చూసి హడలిపోయిందనుకున్న ఫిలిప్స్ తుపాకీని కౌంటర్‌పై పెట్టి తాపీగా కిందపడిన క్యాష్‌ను ఏరుకునేందుకు సిద్ధమయ్యాడు. వెంటనే అప్రమత్తమైన క్లర్కు టేబుల్‌పై ఉన్న తుపాకీ తీసుకుని అతడికి గురిపెట్టింది. అయితే తొలుత ఆమెను ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన దొంగ... ఆమె ధైర్యాన్ని చూసి కాలికి బుద్ధిచెప్పాడు. డబ్బుతో సహా బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు.
కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు హోటల్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. హోటల్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి ఆచూకీ కనుగొనేందుకు సదరు వీడియోను తమ ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ చేశారు. తద్వారా నేరం జరిగిన మరుసటి రోజే అతడిని అరెస్టు చేసి.. చోరీ అయిన సొమ్మును రికవరీ చేశారు. ఇక మహిళా క్లర్కు సాహసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘హ్యాట్సాఫ్ మేడమ్.. మీరు సూపర్.. మీ ఇంటర్వ్యూ కావాలి. దొంగను భలే బురిడీ కొట్టించారు. అందరూ మీలాగా ధైర్యంగా ఉంటే దొంగలకు చుక్కలే ఇక. అయినా వీడేం దొంగ. చోరీ చేయడానికి వచ్చి ఇలా ఎవరైనా మూర్ఖంగా వ్యవహరిస్తారా’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment