వనా క్రై.. వర్రీ!
- ఇదో కొత్త రకం ర్యాన్‌సమ్‌వేర్
- కీలక సమాచారాన్ని బ్లాక్ చేసే సాఫ్ట్‌వేర్
ఒక్కసారిగా మీ కంప్యూటర్‌లో ఉన్న ఫైళ్లేవీ తెరుచుకోకపోతే.. ఎర్రటి స్క్రీన్ వచ్చి మూడు రోజుల్లో 300 డాలర్లు కడితేనే మీఫైళ్లు మీరు చూసుకోగలరన్న హెచ్చరిక కనిపిస్తే.. గత రెండు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో లక్షలాది మంది పరిస్థితి ఇదే. ‘వనా క్రై’ అనే ర్యాన్సమ్‌వేర్ వైరస్ దాడే దీనికి కారణం. దాదాపు వందకుపైగా దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కంప్యూటర్లు ఈ వైరస్ బారినపడ్డాయి. అమెరికా జాతీయ భద్రతా సంస్థ అభివృద్ధి చేసిన ఓ హ్యాకింగ్ టూల్‌ను తస్కరించిన సైబర్ దొంగలు.. దాని సహాయంతో ఈ ‘వనా క్రై’ ర్యాన్సమ్‌వేర్ వైరస్‌ను రూపొందించడం గమనార్హం.
ఈ వైరస్ కారణంగా కంప్యూటర్లు, నెట్‌వర్క్‌లు స్తంభించిపోవడంతో చాలా దేశాల్లోని ఆస్పత్రులు, టెలీకమ్యూనికేషన్లు, ఐటీ కంపెనీలు, ప్రభుత్వ వ్యవస్థల్లో సేవలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా పోలీస్‌స్టేషన్లలో కంప్యూటర్లూ దీని బారినపడ్డాయి. మరి ఏమిటీ ‘వనా క్రై’ ర్యాన్‌సమ్‌వేర్ వైరస్? దానితో ప్రమాదం, జరిగే నష్టాలు ఏమిటి? హ్యాకర్లు డిమాండ్ చేసిన డబ్బు చెల్లిస్తే సరిపోతుందా.. వంటి ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘వనా క్రై’ దాడి, కారణాలు, పరిష్కారం తదితర అంశాలపై సాక్షి ఫోకస్..
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
వ్యాపించేది ఇలా..
ఇంటర్‌నెట్‌లో ర్యాన్‌సమ్‌వేర్ వ్యాపించేందుకు బోలెడన్ని మార్గాలున్నాయి. గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వచ్చే ఈ–మెయిళ్లు.. వాటిల్లో ఉన్న లింక్‌లను క్లిక్ చేస్తే ముందుగా మీ పీసీలోకి ఆ తర్వాత దశలవారీగా మీ కాంటాక్ట్స్‌లో ఉన్న మెయిల్ అడ్రస్‌లకు విస్తరిస్తుంది. కొన్నిసార్లు మీరు ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్, ఇతర సాఫ్ట్‌వేర్లలో ఉండే లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు ర్యాన్‌సమ్‌వేర్‌లను పీసీలు, నెట్‌వర్క్‌లలోకి ప్రవేశపెడతారు. స్మార్ట్‌ఫోన్లలోనైతే ఎస్‌ఎంఎస్ లింకుల ద్వారా ర్యాన్‌సమ్‌వేర్ విస్తరించే అవకాశముంది. ర్యాన్‌సమ్‌వేర్ దాడులను యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లు కూడా గుర్తుపట్టలేవు. ఒకసారి కంప్యూటర్‌లోకి చొరబడ్డాక వైరస్‌ల మాదిరి ర్యాన్‌సమ్‌వేర్ సాఫ్ట్‌వేర్ ఎప్పటికప్పుడు తన రూపురేఖలను మార్చుకునేలా హ్యాకర్లు వీటిని తీర్చిదిద్దుతారు.
1989లో తొలి అటాక్..
ప్రపంచం మొత్తమ్మీద తొలి ర్యాన్‌సమ్‌వేర్ అటాక్ 1989లో జరిగిందని రికార్డులు చెబుతున్నాయి. జోసెఫ్ పాప్ అనే ఎయిడ్స్ పరిశోధకుడు ఈ దాడికి బాధ్యుడని గుర్తించారు. ఎయిడ్స్ ఎవరికి వచ్చే అవకాశముందో తెలుసుకునే సాఫ్ట్‌వేర్ ఉందంటూ జోసెఫ్ దాదాపు 90 దేశాల్లోని ఎయిడ్స్ పరిశోధకులకు 20 వేల ఫ్లాపీ డిస్క్‌లను పంపించాడు. దీంట్లోనే రహస్యంగా ఒక మాల్‌వేర్ ప్రోగ్రామ్ కూడా ఉంది. కొంతకాలం పాటు స్తబ్దుగా ఉన్న ఈ మాల్‌వేర్.. కంప్యూటర్‌ను 90 సార్లు ఆన్/ఆఫ్ చేసిన తర్వాత మేల్కొంది. పీసీలన్నీ బ్లాక్ అయిపోయాయి. 189 డాలర్లు కట్టాలని కొన్ని పీసీలపై.. 378 డాలర్లు చెల్లించాలని మరికొన్ని పీసీలపై సందేశాలు ప్రత్యక్షమయ్యాయి. ఈ ర్యాన్‌సమ్‌వేర్ అటాక్‌ను ఎయిడ్స్ ట్రోజాన్ లేదా పీసీ సైబోర్గ్ అటాక్‌గా పిలుస్తారు.
గత ఏడాది ర్యాన్‌సమ్‌వేర్ దాడులివీ..
► మార్చిలో లాస్‌ఏంజెలెస్‌లోని హాలీవుడ్ ప్రెస్‌బైటీరియన్ హాస్పిటల్ కంప్యూటర్ నెట్‌వర్క్‌పై ర్యాన్‌సమ్‌వేర్ అటాక్ జరిగింది. సమాచారాన్ని తిరిగి పొందేం దుకు ఆసుపత్రి యాజమాన్యం దాదాపు రూ.10 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. ఇది జరిగిన కొన్ని వారాలకే జర్మనీతో పాటు యూకేలోని 28 నేషనల్ హెల్త్ సర్వీసెస్ ట్రస్ట్‌లు కూడా ఇలాటి దాడులకు గురయ్యాయి.
► ఏప్రిల్‌లో రేస్ కార్ల టీమ్ నాస్‌కార్ మిలియన్ డాలర్ల విలువైన సమాచారాన్ని టెస్లాక్రిప్ట్ అటాక్ కారణంగా కోల్పోయింది.
► మసాచూసెట్స్‌లోని ఓ చిన్న పోలీస్ స్టేషన్ కేసుల వివరాలు తిరిగి పొందేందుకు 500 డాలర్లు చెల్లించాల్సి వచ్చింది.
► సెప్టెంబర్‌లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ కాల్‌గెరీ వారం రోజులపాటు ఎన్‌క్రిప్ట్ అయిన తమ ఈ–మెయిళ్లను తిరిగి పొందేందుకు దాదాపు రూ.15 లక్షలు చెల్లించామని అంగీకరించింది.
తప్పించుకునే మార్గం...
జాగ్రత్తగా ఉండటమే.. మూడు ముక్కల్లో చెప్పాలంటే..
► గుర్తు తెలియని ఈ–మెయిళ్లు, వాటిల్లోని అటాచ్‌మెంట్లను ఓపెన్ చేయొద్దు
► కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉంచుకోండి. మరీ ముఖ్యంగా విండోస్‌లో ఎంఎస్17–010ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.. మైక్రోసాఫ్ట్, యాపిల్ సంస్థలు ఎప్పటికప్పుడు విడుదల చేసే సెక్యూరిటీ ప్యాచ్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఉండాలి.
► ముఖ్యమైన ఫైళ్లను ఎప్పటికప్పుడు పీసీతోపాటు కొన్ని ఇతర పరికరాల్లో బ్యాకప్ చేసుకోవాలి. ఎక్స్‌టర్నల్ హార్డ్‌డిస్క్, లేదా పెన్‌డ్రైవ్‌లలో బ్యాకప్ చేసుకోవడం ద్వారా ర్యాన్‌సమ్‌వేర్ అటాక్‌లలో నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
ర్యాన్‌సమ్‌వేర్ దాడుల్లో భారత్ ర్యాంకు 5
తొలి మూడు స్థానాల్లో..అమెరికా, జపాన్, ఇటలీ
సగటున హ్యాకర్లు డిమాండ్ చేసే మొత్తం 2015లో 294 డాలర్లు
సగటున హ్యాకర్లు డిమాండ్ చేసే మొత్తం 2016లో 1077 డాలర్లు
అనుకోకుండా అడ్డుకున్నాడు
వనా క్రై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొంత విధ్వంసం సృష్టించినప్పటికీ బ్రిటన్‌కు చెందిన ఓ టెకీ అనుకోకుండా దీని వ్యాప్తిని అడ్డుకున్నాడు. వనా క్రై ర్యాన్‌సమ్‌వేర్ ఓ డొమైన్ (వెబ్‌సైట్)కు కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తోందని గుర్తించిన అతడు ఆ డొమైన్‌ను ఆన్‌లైన్‌లో కొనేశాడు. దీంతో వనా క్రైకు ఈ డొమైన్‌కు ఉన్న లింక్ తెగిపోయింది. ఫలితంగా దాని వేగం తగ్గిపోయిందని అతడు రాయిటర్స్ సంస్థకు వెల్ల డించాడు. అయితే హ్యాకర్లు తమ కోడ్‌ను మార్చేసి మళ్లీ దాడి చేసే అవకాశం లేకపోలేదని పేర్కొన్నాడు.
భారత్‌లో వ్యాప్తి తక్కువే..
‘యూరప్‌లో ఈ ర్యాన్‌సమ్‌వేర్ శుక్రవారం వ్యాపించడం మొదలైంది. ఆ సమయానికి ఆసియా దేశాల్లో శనివారం సాయంత్రం అయి ఉంది. కాబట్టి భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాల్లో దీని వ్యాప్తి కొంత పరిమితంగానే ఉంది. అంతేకాకుండా ఈ ర్యాన్‌సమ్‌వేర్ వ్యక్తిగత కంప్యూటర్ల కంటే నెట్‌వర్క్‌ల ద్వారా ఎక్కువ వేగంగా వ్యాపించగలదు. జపాన్‌లో పరిస్థితి ఏమిటన్నది సోమవారం ఉదయానికి గానీ తెలియదు. వారు తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశముంది’
– విక్రమ్ ఠాకూర్, ప్రిన్సిపల్ రీసెర్చ్ మేనేజర్,నార్టన్ బై సైమాంటిక్ (యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌సంస్థ)