గతేడాది పెరిగిన ర్యాన్‌సమ్‌వేర్ దాడుల మోతాదు
కంప్యూటర్ ప్రపంచంలో బ్లాక్‌మెయిలింగ్‌కు కొత్త రూపం ఈ ర్యాన్‌సమ్‌వేర్. మీ పీసీలు, ఐటీ వ్యవస్థల్లోని కీలకమైన సమాచారాన్ని (ఫొటోలు, వీడియోలు, బ్యాంక్ అకౌంట్ల వివరాలు) ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ద్వారా మీకు అందుబాటులో లేకుండా చేయడం.. సమాచారం కోసం డబ్బు చెల్లించాలన్న డిమాండ్ పెట్టడం ర్యాన్‌సమ్‌వేర్ అటాక్‌లలో సాధారణ ప్రక్రియ. ర్యాన్‌సమ్‌వేర్‌లో రెండు రకాలున్నాయి. ఎన్‌క్రిప్టింగ్ ర్యాన్‌సమ్‌వేర్‌లో మీ ఫైల్స్ అన్నీ రహస్యమైన సంకేత భాషలోకి మారుతాయి. దీన్నే ఎన్‌క్రిప్షన్ అంటారు. దీంతో మీరు ఆ ఫైళ్లను చూసేందుకు వీలుండదు. ప్రత్యేకమైన కోడ్ లేదా సాఫ్ట్‌వేర్ ద్వారా మాత్రమే ఫైళ్లను సాధారణ స్థితికి తీసుకురావచ్చు. వనా క్రై ఇలాంటిదే. ఇక రెండో రకం ర్యాన్‌సమ్‌వేర్ అటాక్‌లో పీసీ ఆపరేటింగ్ సిస్టమ్ బ్లాక్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో కంప్యూటర్ ఎంతసేపటికీ ఆన్ కాదు. ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆన్ చేసే బూట్ రికార్డ్స్ హ్యాకర్ల సాఫ్ట్‌వేర్ బారిన పడినప్పుడు ఇలా జరుగుతుంది. అయితే ర్యాన్‌సమ్ చెల్లించాక ఫైళ్లు, సమాచారం మనకు మళ్లీ దక్కుతుందన్న గ్యారంటీ ఏమీ లేదు. ర్యాన్‌సమ్‌వేర్ సాఫ్ట్‌వేర్‌లోని లోపాల కారణంగా సమాచారం మొత్తం కోల్పోయే అవకాశాలే ఎక్కువన్నది తాజా అంచనా.
మాల్‌వేర్‌ల కంటే భిన్నం..
కొన్ని లింక్‌లు క్లిక్ చేయగానే.. తమ కంపెనీల వెబ్‌సైట్లు ఓపెన్‌కావడం.. లేదంటే అసభ్యకరమైన సైట్లు తెరుచుకోవడం.. వంటి పనులు మాల్‌వేర్ల ద్వారా జరుగుతుంటాయి. అయితే ర్యాన్‌సమ్‌వేర్ దీనికి భిన్నం. మీకు మీరుగా ఎన్‌క్రిప్షన్‌ను తొలగించడం దాదాపు అసాధ్యం. మీ పీసీలోని అన్ని రకాల ఫైళ్లను ఎన్‌క్రిప్ట్ చేసేందుకు హ్యాకర్లు ప్రత్యేకమైన అల్గారిథమ్స్‌ను ఉపయోగిస్తారు. విరుగుడు వారి దగ్గర మాత్రమే ఉంటుంది. ఫైళ్ల పేర్లు, ఎక్స్‌టెన్షన్లు అన్నీ మారిపోతాయి. ఏ ఫైల్‌లో వర్డ్ డాక్యుమెంట్ ఉందో? ఆడియో, వీడియోల ఫైల్స్ ఏవో కూడా గుర్తించలేరు. సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేశామని.. బిట్‌కాయిన్ల (సైబర్ ప్రపంచంలో చెలామణీ అవుతున్న కరెన్సీ) రూపంలో డబ్బు చెల్లించాలన్న సందేశం మాత్రం తెరపై ప్రత్యక్షమవుతుంది. వనా క్రై విషయాన్ని తీసుకుంటే.. మూడు రోజుల్లోపు 300 డాలర్ల విలువకు సరిపడా బిట్‌కాయిన్లు ఫలానా అడ్రస్‌కు పంపాలన్న సందేశం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ అడ్రస్ భౌతికమైంది కానేకాదు.. బ్యాంక్ అకౌంట్ కూడా కాదు. దీన్ని తెలుసుకోవడం సైబర్ సెక్యూరిటీ నిపుణులకూ చాలా కష్టం.
బ్లాక్‌మెయిలింగ్‌కు కొత్త రూపం
Published Sun, May 14 2017 3:53 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM
Advertisement