గుండె చప్పుడును బట్టి పాట టెంపో..
సప్తస్వరాల సమ్మేళనమైన సంగీతం మనసుకు హాయినీ, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. శిశువులు, పశువులు కూడా సంగీతాన్ని విని ఆనందిస్తాయని చెప్తారు. అటువంటి సంగీతం మన మానసిక స్థితిని బట్టి, మనం ఉన్న పరిసరాలను బట్టి మారడం నిజంగా అద్బుతం. మన గుండె చప్పుడును బట్టి టెంపోను నియంత్రించే నూతన వీడియోను సంగీతజ్ఞుడు జోనాథన్ నూతనంగా సృష్టించాడు. మనసును ఆకట్టుకునేట్టుగా ఈడీఎం ట్రాక్ తో అద్భుత సంగీతాన్నిరూపొందించాడు.
డీఎన్ ఏ ప్రాజెక్ట్ 'జె. వ్యూజ్' ద్వారా జోనాథన్ దగాన్.. విడుదల చేసిన 'ఆల్మోస్ట్ ఫర్ గాట్' మ్యూజిక్ వీడియో ఇప్పుడు సంగీత ప్రేమికులనే కాక సాధారణ జనాన్నీ అమితంగా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ తోపాటు యాప్ గా విడుదలైన వీడియో... మనుషుల మానసిక స్థితికి తగ్గట్టుగా ప్లే అవుతూ అద్బుతాన్ని తలపిస్తోంది. ఫోన్ లోని కెమెరా ద్వారా మన హృదయ స్పందనలను స్కాన్ చేసే మ్యూజిక్ యాప్.. అప్పటి మన మానసిక స్థితికి అనుగుణంగా గుండె చప్పుడును బట్టి పాట టెంపోను మారుస్తుంది.
ఉదాహరణకు మనం జిమ్ లోని ట్రెడ్ మిల్ పై పరుగెడుతుంటే పాట టెంపో కూడా వేగంగా మారిపోతుంది. అదే మన హార్ట్ రేట్ నెమ్మదిగా మారినప్పుడు ఆ టెంపో స్లో అవుతుంది. అయితే ప్రస్తుతం ఈ అనువర్తనం ఒక్క ఐవోఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. అండ్రాయిడ్ యూజర్లు మాత్రం 'ఆల్మోస్ట్ ఫర్ గాట్' వెబ్ సైట్ నుంచి పొందే అవకాశం ఉంది.
గతంలో ఇటువంటి ప్రయత్నాలు ఎన్నో జరిగి, 'స్పోర్టిఫై రన్' వంటివి అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటిలో వినియోగదారులు వారికిష్టమైన టెంపోను స్వయంగా సెట్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు గుండె చప్పుడును బట్టి దానంతటదే టెంపో మార్చుకునే అవకాశం ఈ కొత్త ప్రయోగంలో పొందుపరచబడింది. ఆల్మోస్ట్ ఫర్ గాట్ వీడియో యాప్ ను డౌన్ లోడ్ చేసుకొనేవారు ఐ ట్యూన్స్ యాప్ స్టోర్ నుంచి ఉచితంగా చేసుకునే అవకాశం ఉంది.