
నడిస్తేనే ఆ సైకిల్ ముందుకు కదుల్తుంది..
ఎవరికైనా సైకిల్ అంటే ఒక హ్యాండిల్, సీట్, పెడల్స్, రెండు చక్రాలు గుర్తుకువస్తాయి. ఇది సహజమే. కానీ కాలం మారింది గురూ.. రోజుకో కొత్త టెక్నాలజీ మార్కెట్లోకి వస్తోంది. ప్రస్తుతమున్న టెక్నాలజీలే అప్‌డేట్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి వాటికి తగ్గట్టు మనం కూడా అప్‌డేట్ అవ్వాలి. ఈ సోది అంతా ఎందుకు మ్యాటర్‌కి రా అంటారా? అదే చెబుతున్నా.. ఈ ఫొటోలో కనిపిస్తున్న సైకిల్ సాధారణ సైకిల్‌లాగే ఉన్నప్పటికీ దీనికో ప్రత్యేకత ఉంది. సైకిల్ ముందుకు కదలాలి అంటే ఎవరైనా పెడల్‌ను తొక్కాలి. కానీ ఈ సైకిల్ ముందుకెళ్లాలంటే మాత్రం దీనిపై మనం నడవాల్సిందే. సైకిల్‌పై ఉన్న ట్రెడ్‌మిల్‌పై వాహనదారుడు నడుస్తూ ఉంటే సైకిల్ ముందుకు కదులుతూ ఉంటుంది. ఈ సైకిల్‌కు ఒక ఎలక్ట్రిక్ మోటార్‌ను ఫిట్ చేశారు.
ఈ ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతో సైకిల్ ముందుకు కదులుతుంది. రెండు చక్రాల మధ్య ఉన్న ట్రెడ్‌మిల్‌పై వాహనదారుడు నడుస్తూ ఉంటే ఎలక్ట్రిక్ మోటార్‌కు శక్తి అంది సైకిల్ ముందుకు కదులుతుంది. మనిషి సామర్థ్యాన్ని బట్టి ఇది గంటకు 6 నుంచి 27 కి.మీ. వేగంతో వెళ్లగలదు. దీని ధర 2,115 యూఎస్ డాలర్లు (సుమారుగా రూ. 14 లక్షలు).. డచ్‌కు చెందిన శాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. ప్రస్తుతం వీటికి డిమాండ్ బాగా పెరగడంతో తయారీదారులు వీటిని ఉత్పత్తి చేసే పనిలో పడ్డారు. దీని పేరు లోపాన్. డచ్‌లో లోపాన్ అంటే నడవడం అని అర్థం.