
ట్రంప్ షికాగో ర్యాలీ రద్దు
మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణ కారణంగా..
వాషింగ్టన్: మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య ఘర్షణ వల్ల డోనాల్డ్ ట్రంప్ తన షికాగో ప్రచార ర్యాలీని రద్దు చేసుకున్నారు. దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ టికెట్ రేసులో ముందంజలో ఉన్న ట్రంప్ శుక్రవారం రాత్రి ఇలినాయ్ వర్సిటీలో జరిగే సభలో పాల్గొనాల్సి ఉండింది. అయితే అక్కడికి వందల సంఖ్యలో నిరసనకారులు చేరుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులు, ట్రంప్ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరుపక్షాలు నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించి, ముష్టియుద్ధానికి దిగాయి.
ఉద్రిక్తత పెరుగుతుందని గ్రహించిన ట్రంప్ అక్కడి పరిస్థితిపై పోలీసులతో చర్చించారు. వారి సూచన మేరకు ర్యాలీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా నిరసనల కారణంగా ఓ రాజకీయ ర్యాలీ రద్దవడం అత్యంత అరుదైన ఘటనల్లో ఒకటిగా నిపుణులు అభివర్ణించారు. ఈ గొడవలో సపన్ దేవ్ అనే భారతీయ జర్నలిస్టుకు కూడా గాయాల య్యాయి. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఎవరూ గాయపడటం తనకు ఇష్టం లేదని, హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకే ర్యాలీని రద్దు చేశానని అన్నారు. జర్నలిస్టుకు గాయంపై విచారం వ్యక్తం చేశారు. దేశంలోని ఆర్థిక సమస్యే ఆందోళనకు కారణంగా పేర్కొన్నారు. ఈ హింసకు ట్రంప్ కారణమంటూ రిపబ్లికన్ పార్టీకే చెందిన ఆయన ప్రత్యర్థులు టెడ్ క్రజ్, మార్క్ రుబియోలు ఆరోపించారు.