ఒకసారి అమెరికాను వీడితే.. | Trump defends his executive orders on immigration | Sakshi
Sakshi News home page

ఒకసారి అమెరికాను వీడితే..

Published Mon, Jan 30 2017 2:48 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ఒకసారి అమెరికాను వీడితే.. - Sakshi

ఒకసారి అమెరికాను వీడితే..

మళ్లీ వెళ్లడం కుదరదు!
► తాత్కాలిక వీసాతో పాటు, గ్రీన్ కార్డుదారుల్ని అడ్డుకునే అధికారం
► ఆందోళనలో ఏడు దేశాలకు చెందిన ఐదు లక్షల మంది
 ► ట్రంప్‌ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శల వెల్లువ
► నా నిర్ణయం బాగా అమలవుతోంది: ట్రంప్‌

వాషింగ్టన్ /న్యూయార్క్‌: ఏడు ముస్లిం దేశాల నుంచి పౌరులు రాకుండా అడ్డుకునేలా దేశాధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తున్న ఆయా దేశాల వారి గుండెల్లో గుబులు రేపుతోంది. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంతో అమెరికా పౌరసత్వం కలిగి ఉంటే తప్ప... తాత్కాలిక విద్యార్థి, ఉద్యోగ వీసాలు ఉన్నవారితో సహా గ్రీన్ కార్డుదారులు ఒకసారి అమెరికా వదిలివెళ్తే ఇకనుంచి తిరిగి వెళ్లడం కుదరదు. సెలవు, ఉద్యోగ కారణాలతో అమెరికా వదిలి వెళ్లినవారినీ అమెరికాలోకి అనుమతించరని హోం ల్యాండ్‌ భద్రతా విభాగం అధికారులు చెబుతున్నారు. ముస్లిం ఆధిక్య దేశాలైన ఇరాన్ , ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్ , సిరియా, యెమెన్ దేశాల నుంచి అమెరికాలోకి వలసలు రాకుండా 90 రోజులు నిషేధం విధిస్తూ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఈ నిర్ణయంతో ఏడు దేశాలకు చెందిన విద్యార్థి, ఉద్యోగ వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారే కాకుండా 5 లక్షల మంది గ్రీన్ కార్డుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఒకసారి దేశం వదిలివెళ్తే అమెరికాలో ప్రవేశించకుండా అడ్డుకునేలా ట్రంప్‌ ఉత్తర్వులున్నాయని,  దౌత్య వీసాలు ఉన్నవారికి  మినహాయింపు ఉంటుందని హోం ల్యాండ్‌ విభాగం చెబుతోంది. ‘ఈ నిర్ణయం ప్రకారం తాత్కాలికంగా విదేశీ పర్యటనకు వెళ్లిన వారు అమెరికాకు తిరిగి రావడం కష్టం... విద్యార్థి శీతాకాల సెలవుపై స్వదేశానికి వెళ్తే అమెరికా రావడం కుదరదు’ అని న్యాయ నిపుణుడు లెగోంస్కీ పేర్కొన్నారు. గత మూడేళ్లలో ఈ ఏడు దేశాలకు చెందిన 25 వేల మందికి విద్యార్థి లేదా ఉద్యోగ వీసాలు జారీ చేశారని, గత పదేళ్లలో 5 లక్షల మందికి గ్రీన్ కార్డులు జారీ అయ్యాయని హోం ల్యాండ్‌ భద్రతా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గ్రీన్ కార్డుదారుల్లో ఇరాన్, ఇరాక్‌లకు చెందిన వారే 2.5 లక్షల మంది వరకూ ఉన్నారు.

వివాహ వీసాలు రద్దు.. కొత్త జంటలకు తీవ్ర నిరాశ
ట్రంప్‌ నిర్ణయంతో పలు కుటుంబాలు విడిపోవడమే కాకుండా, కొడుకు పెళ్లికి తల్లిదండ్రులు వెళ్లలేని పరిస్థితి. కొత్తగా పెళ్లైన దంపతులకు వివాహ వీసా రద్దు కావడంతో వారు విడిగా ఉండాల్సిందే...  ఇరాన్ నుంచి అమెరికా వెళ్తోన్న పలువురిని విమనాశ్రయాల్లోనే అడ్డుకున్నారు. ఒక ఇరానియన్  కుటుంబాన్ని కైరోలో న్యూయార్క్‌ విమానం ఎక్కకుండా ఆపా రు. ‘ఇల్లు, కారు, ఫర్నీచర్‌ అమ్మేశాను. నేను, నా భార్య ఉద్యోగాలకు రాజీనామా చేశాం. పిల్లల్ని స్కూలు నుంచి తీసుకొచ్చేశాం. ట్రంప్‌ నా జీవితాన్ని నాశనం చేశాడు’ అని ఫుయాద్‌ షరెఫ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇరాక్‌లోను ట్రంప్‌ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఏడు దేశాలకు చెందిన ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారికి కూడా అమెరికాలో ప్రవేశం ఉండకపోవచ్చని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీ పేర్కొంది.

ప్రపంచ దేశాధినేతల ఖండన.. ట్రంప్‌ నిర్ణయాన్ని ప్రపంచ దేశాధినేతలు తప్పుపట్టారు. ఉగ్రవాదంపై పోరు అత్యంత అవశ్యకమైనా సరే... ఒక జాతికి, విశ్వాసానికి చెందిన ప్రజల్ని సందేహించడం సరికాదని జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ తప్పుపట్టారు. ద్వంద్వ పౌరసత్వం ఉన్న జర్మనీ ప్రజలపై ట్రంప్‌ నిర్ణయ ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామన్నారు. ట్రంప్‌ నిర్ణయాన్ని అంగీకరించమని బ్రిటన్  ప్రధాని థెరెసా మే అన్నారు. .

అద్భుతం.. అమోఘం: ట్రంప్‌
ఏడు ముస్లిం దేశాల నుంచి పౌరులపై తాత్కాలిక నిషేధం చాలా బాగా పనిచేస్తుందని, అదలాగే కొనసాగుతుందని ట్రంప్‌ చెప్పారు. ‘ఎయిర్‌పోర్టులు, మిగతా చోట్ల చూస్తే... ఇది చాలా బాగా పనిచేస్తోంది. మనం చాలా కఠినమైన నిషేధాన్ని అమలు చేస్తున్నాం. క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తున్నాం... ఎన్నో ఏళ్ల నుంచి ఇలా చేసి ఉండాల్సింది’ అని చెప్పారు. ఈ నిర్ణయం ముస్లింలపై నిషేధం కాదన్నారు. ఐసిస్‌ను ఓడించేందుకు అవసరమైన సమగ్ర వ్యూహాన్ని 30 రోజుల్లోపు రచించాలని ట్రంప్‌ ఆ దేశ సైనిక విభాగాన్ని ఆదేశించారు.

దీటుగా స్పందించిన ఇరాన్
ట్రంప్‌ నిర్ణయానికి దీటుగా ఇరాన్   సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి అమెరికన్ల రాకపై కఠిన ఆంక్షలు విధించింది.  
 
మా దేశానికి రండి: కెనడా ప్రధాని  
అట్టావా: ఉగ్రవాదం, యుద్ధం వల్ల స్వదేశాన్ని విడిచిపెడుతున్న శరణార్థులకు కెనడా ప్రధాని ట్రూడ్యూ స్వాగతం పలుకుతూ ట్వీట్‌ చేశారు.  ‘వారి విశ్వాసాలతో నిమిత్తం లేకుండా కెనడాకు ఆహ్వానిస్తున్నాం. భిన్నత్వమే మన బలం’ అని పేర్కొన్నారు.

విమానాశ్రయాల వద్ద నిరసనల హోరు
ట్రంప్‌ నిర్ణయంపై ఆదివారం నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల వద్ద వేలాది మంది ఆందోళనకు దిగారు. గ్రీన్  కార్డ్స్‌ ఉన్నవారినీఅరెస్ట్‌ చేసి వెనక్కి పంపించేస్తారని, అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తారని వార్తలు రావడంతో విమానాశ్రయాలకు చేరుకుని నిరసన తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే న్యూయార్క్‌లోని జాన్  ఎఫ్‌ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు వేలాది మంది చేరుకుని, ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బోస్టన్ , లాస్‌ ఏంజెలిస్, హ్యూస్టన్  తదితర విమానాశ్రయాల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిర్ణయంతో యూఎస్‌ వీసా, గ్రీన్ కార్డులు ఉన్నవారు, వ్యక్తిగత పనిమీద విదేశాలకు వెళ్లిన వారూ ఇబ్బందులు పడ్డారు.

వీసాలుంటే అడ్డుకోవద్దు: అమెరికా జడ్జి తీర్పు
వరుస నిర్ణయాలతో అలజడి రేపుతున్న ట్రంప్‌కు అమెరికా జడ్జి ఒకరు గట్టి షాకిచ్చారు. విమానాశ్రయాలు, ఇతర ప్రాంతాల్లో అధికారులు అదుపులోకి తీసుకున్న శరణార్థులు, వీసా ఉన్నవారిని వెనక్కి పంపవద్దంటూ న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ జిల్లా జడ్డి యాన్‌ డానలీ అత్యవసర ఆదేశాలు జారీచేశారు. న్యూయార్క్‌ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న ఇద్దరు ఇరాక్‌ పౌరుల తరఫున ‘అమెరికన్  సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్  (ఏసీఎల్‌యూ)’ దాఖలు చేసిన పిటిషన్  విచారణ సందర్భంగా ఈ ఆదేశాలిచ్చారు. ‘అమెరికా పౌరసత్వ, వలసదారుల విభాగం ఆమోదించిన శరణార్థుల దరఖాస్తుల్ని ప్రభుత్వం తిరస్కరించకూడదు.. చెల్లుబాటయ్యే వీసాలతో ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్  దేశాల నుంచి వచ్చేవారు అమెరికాలో ప్రవేశించేందుకు చట్టప్రకారం అర్హులు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

పాకిస్తాన్‌పైనా నిషేధం...?
అమెరికాలోకి వలసల నిషేధ దేశాల జాబితాలో పాకిస్తాన్ ను కూడా చేర్చే అవకాశాలున్నాయంటూ వైట్‌హౌస్‌ ఉన్నతాధికారి అదివారం సూచనప్రాయంగా వెల్లడించారు. జాబితాలో కేవలం ఏడు ముస్లిం ఆధిక్య దేశాల్ని చేర్చడం వెనుక కారణాలు వెల్లడిస్తూ..‘ఆ ఏడింటిని ప్రమాదకర ఉగ్రవాదం సాగుతున్న దేశాలుగా అమెరికా కాంగ్రెస్‌తో పాటు ఒబామా యంత్రాంగం గుర్తించాయని’ వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాప్‌ రెయిన్స్  ప్రీబస్‌ చెప్పారు. ఇప్పుడు అదే తరహా పరిస్థితులున్న పాకిస్తాన్  వంటి దేశాల గురించి మీరు ప్రస్తావించవచ్చని, బహుశా తర్వాత వాటిపైనే ట్రంప్‌ సర్కారు నిషేధం విధింవచ్చని ప్రీబస్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం తక్షణ చర్యలుగా... ఆ దేశాల నుంచి వచ్చి, వెళ్లేవారి వివరాలు క్షుణ్నంగా తనిఖీ చేస్తామని ప్రీబస్‌ వెల్లడించారు. వలసల నిషేధ జాబితాలో పాకిస్తాన్ ను చేర్చడంపై ట్రంప్‌ యంత్రాంగం బహిరంగంగా మాట్లాడడం ఇదే మొదటిసారి.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement