రెండో డిబేట్‌లో మాటల యుద్ధం
అమెరికా అధ్యక్ష అభ్యర్థులు హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ రెండో డిబేట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో మహిళలపై ట్రంప్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను హిల్లరీ ఎండగట్టారు. ట్రంప్ వ్యక్తిత్వమేంటో ఆడియోటేపుల్లో బయటపడిందని.. అధ్యక్ష పదవికి ట్రంప్ తగినవ్యక్తి కాదని హిల్లరీ అన్నారు. అయితే.. మహిళలను తానెప్పుడూ కించపరచలేదని.. వారిపట్ల తనకెంతో గౌరవం ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఆడియో టేపుల్లో బయటపడిన వ్యవహారాన్ని ప్రైవేటు సంభాషణగా చూడాలన్న ట్రంప్.. తాను చేసిన వ్యాఖ్యల పట్ల అమెరికా ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అసలు మహిళలను కించపరిచింది హిల్లరీ భర్త బిల్ క్లింటన్ అంటూ ట్రంప్ ఎదురుదాడికి దిగారు. అధికార వ్యవహారాలకు వ్యక్తిగత మెయిల్‌ను వాడిన విషయంలో హిల్లరీ క్షమాపణలు చెప్పాలని.. 33 వేల ఈమెయిల్స్‌ను ఆమె ఎందుకు తొలగించారో చెప్పాలని ట్రంప్ అన్నారు. ఈమెయిల్స్ వ్యవహారంలో హిల్లరీ జైల్లో ఉండాలని.. తాను గెలిస్తే ఈ విషయంలో విచారణ జరిపిస్తానని ట్రంప్ అన్నారు. అయితే ఈమెయిల్స్ వ్యవహారంలో ఎప్పుడో తన తప్పును అంగీకరించానని హిల్లరీ అన్నారు.
ముస్లింలను అవమానించడం సరికాదని.. అమెరికా అందరికి స్వాగతం పలుకుతుందని హిల్లరీ అన్నారు. అమెరికన్లు ఇస్లాంతో యుద్ధం చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. అమెరికా సైట్లను రష్యా హ్యాక్ చేస్తుందని.. పుతిన్ ట్రంప్‌ను ఎందుకు సమర్ధిస్తున్నారని హిల్లరీ ప్రశ్నించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. హిల్లరీకి ప్రతిదానికి రష్యాను నిందించడం అలవాటైపోయిందన్నారు. తనకు రష్యాతో గానీ.. పుతిన్‌తో గానీ ఎలాంటి సంబంధాలు లేవని ట్రంప్ స్పష్టం చేశారు. తాను అధికారంలోకి వస్తే పన్నులను కనిష్ట స్థాయికి తీసుకోస్తానని ట్రంప్ అన్నారు.