వెన్నాడుతున్న ‘రష్యన్ల జోక్యం’!
- రష్యా లాయర్‌తో ట్రంప్ కొడుకు భేటీపై దుమారం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కొడుకు ట్రంప్ జూనియర్ కిందటేడాది జూన్లో రష్యా లాయర్ నటాలియా వెసెల్నిత్‌స్కాయాతో న్యూయార్క్ ట్రంప్ టవర్లో జరిపిన సమావేశం అధ్యక్ష ఎన్నికల్లో రష్యన్ల పాత్రపై కొత్త సంచలనానికి తెరతీసింది. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అప్పటికి రష్యాతో జరిపిన వ్యవహారాల్లో ఆమె లొసుగులు ఎత్తిచూపే సమాచారం ఈ రష్యన్ వకీలు దగ్గరుందని ప్రజా సంబంధాల నిపుణుడు, బ్రిటిష్ టాబ్లాయిడ్ పూర్వ విలేఖరి రాబ్ గోల్డ్‌స్టోన్ 2016 మధ్యలో ట్రంప్ జూనియర్‌కు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారని ప్రసిద్ధ అమెరికా దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ సోమవారం వెల్లడించింది.
నటాలియాతో ట్రంప్ కొడుకు భేటీని గోల్డ్‌స్టోన్ ఏర్పాటు చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ట్రంప్ యత్నిస్తున్న సమయంలో రష్యా సాయం తీసుకోవడానికి ఆయన బృందం పనిచేసిందనే ఆరోపణకు ఈ సమాచారం సాక్ష్యాధారంగా కనిపిస్తోంది. ట్రంప్ ప్రచార బృందం రష్యన్లతో కుమ్మక్కయిందనడానికి, హిల్లరీని దెబ్బదీసే సమాచారం కోసం అన్వేషిస్తున్న సమయంలో జరిగిన ఈ సమావేశం మొదటి స్పష్టమైన సాక్ష్యమని సెనట్ ఇంటెలిజెన్స్ కమిటీలో ప్రముఖ డెమొక్రాటిక్ పార్టీ సభ్యుడొకరు చెప్పారు. అయితే, లాయర్ నటాలియాతో భేటీ మాట నిజమేగాని ఈ 20-30 నిమిషాల సమావేశంలో మాట్లాడినది రష్యా పిల్లలను అమెరికా పౌరులు దత్తత తీసుకోవడంపైనేనని ట్రంప్ జూనియర్ వివరణ ఇచ్చారు.
నటాలియా వెల్లడించిందేమీ లేదు: జూ.ట్రంప్
ట్రంప్ జూనియర్‌కు పంపిన ఈ-మెయిల్‌ను టైమ్స్ ప్రచురించలేదు. అయితే, ముగ్గురు వేర్వేరు వ్యక్తులు తమకు ఈ ఈ-మెయిల్ వివరాలు వెల్లడించారని తెలిపింది. 'ఈ సమావేశంలో ట్రంప్ పాల్గొనలేదు. దాని గురించి ఆయనకు తెలియదు' అని రష్యన్ల పాత్రపై జరుగుతున్న విచారణలో ట్రంప్ ప్రైవేటు లాయర్ మార్క్ కాసోవిజ్ ప్రతినిధి మార్క్ కొరారో తెలిపారు. టైమ్స్ కథనంపై వైట్‌హౌస్ ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. రష్యాతో సంబంధమున్న వ్యక్తులు డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ)కి నిధులు సమకూర్చుతున్నారనీ, హిల్లరీకి తోడ్పడుతున్నారని తనకు సమాచారముందని నటాలియా తనకు చెప్పిందని ట్రంప్ జూనియర్ ఆదివారం అంగీకరించారు. అయితే, ఆమె అందుకు సంబంధించిన వివరాలుగాని, సమాచారం గాని తనకు వెల్లడించలేదని, నటాలియా దగ్గర తగిన అర్ధవంతమైన సమాచారం లేదని వెంటనే తనకు అర్ధమైందని కూడా ఆయన వివరించారు.
ఎవరి ద్వారా ఈ భేటీ జరిగింది?
తన తండ్రి నిర్వహణలోని 2013 మిస్ యూనివర్స్ ఎంపిక కార్యక్రమం సందర్భంగా పరిచయమైన వ్యక్తి ద్వారా తనకు రష్యన్ మహిళా వకీలుతో సమావేశం ఏర్పాటు చేశారని ట్రంప్ జూనియర్ తెలిపారు. అయితే, ఆ వ్యక్తి పేరు వెల్లడించలేదు. కాని, తన రష్యన్ క్లయింట్ ఎమీన్ అరగోవ్ చొరవతోనే ఈ సమావేశం ఏర్పాటు చేశామని గోల్డ్‌స్టోన్ ఎపీ వార్తాసంస్థకు తెలిపారు. ట్రంప్ టవర్-మాస్కో ప్రాజెక్టులో ట్రంప్‌తో వాటా కలవాలని ఆశించిన మాస్కో రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకే అగరలోవ్ అని తేలింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి కూడా ట్రంప్ జూనియర్-నటాలియా భేటీపై వివరాలు చెప్పడానికి నిరాకరించారు. 'ప్రతి రష్యన్ లాయర్ రష్యాలోనూ, ఇతర దేశాల్లో ఎవరెవరని కలుసుకునేదీ ఎప్పటికప్పుడు తెలుసుకోవడం రష్యా సర్కారుకు కుదరని పని అని పుతిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు.
-(సాక్షి నాలెడ్జ్ సెంటర్)