హోప్ హిక్స్ (ఫైల్ ఫోటో)
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆయన వ్యక్తిగత కార్యదర్శి, వైట్ హౌజ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ హోప్ హిక్స్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2016 లో అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై హౌస్ ప్యానెల్ విచారించిన మరుసటి రోజే ఆమె రాజీనామా చేయడం గమనార్హం. విచారణ నేపథ్యంతోపాటు, వ్యక్తిగత కారణా వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోప్ వెల్లడించారు.
గత మూడేళ్లుగా ట్రంప్ అంతరంగికురాలుగా ఆయన వెన్నంటే ఉన్న హోప్.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఇమేజ్‌ను పెంపొందించేందుకు విరివిగా ప్రచారం నిర్వహించారు. అంతేకాదు మానసికంగా కూడా పలు సందర్భాల్లో ఆమె ట్రంప్‌ను నియంత్రించారని.. ఆ చొరవతో ట్రంప్ ఆమెను కూతురిలా భావించేవారని ట్రంప్ సన్నిహితులు చెబుతుంటారు. మాజీ మోడల్ అయిన హౌప్ గతంలో ట్రంప్ కుమార్తె ఇవాంక కోసం పని చేశారు.
ట్రంప్‌తో ఆమె దగ్గరి సంబంధాల మూలంగానే రాబర్ట్ ముల్లర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక కౌన్సిల్ కూడా ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఈ పరిణామాలతో కలత చెందిన ఆమె రాజీనామా చేసినట్లు స్పష్టమౌతోంది. మరోవైపు అప్పుడప్పుడు ఆమె ట్రంప్‌కు రష్యా దర్యాప్తు విషయంలో అబద్ధాలు చెప్పేదని హౌస్ ఇంటలిజెన్స్ ప్యానెల్ ఆరోపించింది. అయితే తాను ఎలాంటి అబద్ధాలు చెప్పలేదని హోప్ పేర్కొన్నారు. ఆమె రాజీనామాపై స్పందించిన ట్రంప్ కార్యాలయం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భవిష్యత్తులో మళ్లీ ఆమెను కొనసాగించే అవకాశాలను పరిశీలిస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment