లామాల్బే(కెనడా): జీ–7 కూటమిలోకి రష్యాను తిరిగి చేర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆకాంక్షించారు. కెనడాలోని క్యూబెక్‌లో జీ–7 దేశాల కూటమి సదస్సుకు హాజరయ్యేందుకు బయల్దేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చల్లో రష్యా ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘వాళ్లు రష్యాను కూటమి నుంచి పంపించారు. రష్యా మళ్లీ మనతో చేరాలి’ అని పరోక్షంగా ఇతర భాగస్వామ్య దేశాలనుద్దేశించి వ్యాఖ్యానించారు.
ట్రంప్ ప్రతిపాదనను కూటమిలోని యూరోపియన్ దేశాలు వ్యతిరేకించాయి. క్రిమియాను ఆక్రమించినందుకు 2014లో రష్యాను ఈ కూటమి నుంచి తొలగించారు. దీంతో అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్‌లతో జీ–7గా మారింది. శుక్రవారం ప్రారంభమైన ఈ కూటమి సదస్సులో వాణిజ్య వివాదాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. తమ ఇనుము, అల్యూమినియం ఎగుమతులపై టారిఫ్‌లు పెంచడంతో మిత్ర దేశాలు అమెరికాపై మండిపడుతున్నాయి. దీంతో సదస్సు ముగిసిన తరువాత ఏకాభిప్రాయంతో కూడిన ఉమ్మడి ప్రకటన జారీకాకపోవచ్చని తెలుస్తోంది.
అగ్రరాజ్యంతో తాడోపేడో..
‘అమెరికాతో వాణిజ్యం చేసి అన్ని దేశాలు ప్రయోజనం పొందాయి. మేము మాత్రం లోటువాణిజ్యంలో మునిగిపోతున్నాం. ఆ లెక్కను సరిచేయాలనుకుంటున్నా ’ అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రచ్చన్న యుద్ధం ముగిసిన తరువాత జీ–7 దేశాలు తొలిసారి పలు అంశాలపై చీలిపోయాయి. అందులో పర్యావరణం, ఇరాన్‌తో అణు ఒప్పందం లాంటివి ఉన్నాయి. టారిఫ్‌లు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించాలని మిగిలిన సభ్య దేశాలు భావిస్తున్నాయి. వాణిజ్యం విషయంలో ట్రంప్‌తో రాజీకుదరకపోతే తామూ వెనకడుగు వేయమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ తేల్చిచెప్పారు.
వైట్‌హౌజ్‌కు ఆహ్వానిస్తా!
వాషింగ్టన్: జూన్ 12న సింగపూర్‌లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో జరగనున్న సమావేశం సానుకూలంగా సాగితే.. ఆయన్ను శ్వేతసౌధానికి ఆహ్వానిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే, సమావేశంలో అనుకున్న లక్ష్యాలు నెరవేరని పక్షంలో వెంటనే బయటకు వచ్చేందుకు కూడా సంకోచించబోనని ఆయన స్పష్టం చేశారు. జపాన్ ప్రధాని షింజో అబేతో వైట్‌హౌజ్‌లో సమావేశమైన సందర్భంగా ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ‘ఉత్తరకొరియాతో యుద్ధానికి ముగింపు పలికే ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశం సానుకూలంగా సాగితే కిమ్‌ను వైట్‌హౌజ్‌కు లేదా ఫ్లోరిడాలోని మారాలాగో రిసార్టుకు ఆహ్వానిస్తా. అనుకున్న లక్ష్యాల దిశగా భేటీ జరగకపోతే.. వెంటనే బయటకు వచ్చేస్తా’ అని ట్రంప్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment