
యాక్టివిస్టును ఐఎస్ఐఎస్ అధినేతగా పొరపడి..!
న్యూయార్క్: ఐయాద్ ఎల్ బాగ్దాది.. అరబ్ విప్లవంలో పాల్గొన్న ప్రముఖ హక్కుల కార్యకర్త ఆయన. ఆయనకు ట్విట్టర్‌లో 70వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల దుశ్చర్యలను ఆయన నిత్యం ట్విట్టర్‌లో తప్పుబడుతూ ఉంటారు కూడా. కానీ ట్విట్టర్ మాత్రం ఆయనను ఐఎస్ఐఎస్ అధినేత అబు బాకర్ అల్ బాగ్దాదిగా భావించింది. ఇద్దరి ఇంటిపేర్లు ఒకతీరుగా ఉండటంతో తనను ఐఎస్‌ఐఎస్ అధినేతగా భావించి అరగంటపాటు తన అకౌంట్‌ను ట్విట్టర్ సస్పెండ్ చేసిందని ఐయాద్ తెలిపారు. ఇండోనేషియా పత్రిక రిపబ్లికాను ఉటంకిస్తూ ఈ విషయాన్నిబీబీసీ వెల్లడించింది.
'సాధారణమైన అరబిక్ ఇంటిపేరు ఉండటంతో ఒక అరబ్ వ్యక్తిని ఐఎస్‌ఐఎస్ నేతగా ట్విట్టర్ పొరపడింది. ఇది కూడా ఒక రకం జాతి వివక్షే' అంటూ ఐయాద్ ట్విట్టర్‌లో తెలిపారు. తన ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించిన తర్వాత ఆయన ఈ విషయమై స్పందించారు. 'ఈ ఏడాది నా ఖాతా మీద ట్విట్టర్‌లో పదివేల అభిప్రాయాలు వెలువడ్డాయి. కానీ నా ఖాతాను నిర్దాక్షిణంగా సస్పెండ్ చేసి పక్కనబెట్టారు. అరబ్ దేశాలన్నింటిలోనూ ఎల్ బాగ్దాదీ ఇంటిపేరుతో ఉన్న కుటుంబాలు ఉంటాయి. ఎలాంటి వివరణ ఇవ్వకుండా నా ఖాతాను ఎలా సస్పెండ్ చేస్తారు' అని ఆయన ప్రశ్నించారు. నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంతో తన ఖాతాను ట్విట్టర్ సస్పెండ్ చేసిందని, కానీ తాను ఏ నిబంధనల్ని ఉల్లంఘించానో అది వెల్లడించలేదని పేర్కొన్నారు. ఖాతాల విషయంలో ట్విట్టర్ మరింత పారదర్శకంగా ఉండి ఎందుకు వాటిని రద్దు చేస్తున్నదో ముందే వెల్లడించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.