దుబాయ్: సాధారణంగా ఇష్టసఖి పుట్టినరోజు అంటే గులాబీలు, చాక్లెట్లు, టెడ్డీబేర్లు ఇచ్చే ప్రేమికుల గురించి విన్నాం. కానీ ఓ వ్యక్తి వీటన్నికంటే భిన్నంగా ఓ అరుదైన బహుమతిని ఇవ్వాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అప్పుడే పుట్టిన ఓ ఒంటె పిల్లను దొంగతనం చేసి ప్రేయసికి కానుక అందించాడు. అతడు చేసిన పనికి ఇద్దరూ కటకటాలపాలయ్యారు. ఈ ఘటన దుబాయ్‌లో చోటు చేసుకుంది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. కొన్ని రోజుల క్రితం ఓ జంట తమ ఒంటె పిల్ల కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా దొంగ వెన్నులో వణుకుపుట్టింది.
ఈ క్రమంలో ఎక్కడి నుంచైతే ఒంటె పిల్లను ఎత్తుకొచ్చాడో అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో దానిని వదిలిపెట్టి వచ్చాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి తానే దాని జాడను చెప్పాడు. కొన్ని రోజులుగా అక్కడే తచ్చాడుతుందంటూ సమాచారం అందించారు. దీంతో లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. ప్రేమికురాలికి గిఫ్టు ఇచ్చేందుకే ఈ దొంగతనం చేశానని అతడు అంగీకరించాడు. తొలుత తల్లి ఒంటెనే తీసుకువెళ్దామని భావించానని, అయితే అప్పుడే ఓనర్లు రావడంతో దానిని వదిలేసి పిల్లను ఎత్తుకెళ్లినట్లు తెలిపాడు.
ఈ నేపథ్యంలో చోరీ చేయడమే కాకుండా తమను తప్పుదోవపట్టించినందుకు నిందితుడు, అతడి ప్రియురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా అరబ్ దేశాల్లో చాలా కుటుంబాలు పోషణ కోసం ఒంటెల మీద ఆధారపడతాయన్న విషయం తెలిసిందే. పాలు, ఇతర ఆహార ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా కొట్టాలు వేసి వాటిని పెంచుతూ ఉంటారు. మరోవైపు, రేసుల కోసం కూడా కొంతమంది ఒంటెలను కొనుగోలు చేస్తారు. కొన్ని ప్రత్యేక జాతులకు చెందిన ఒంటెలకు అందాల పోటీలు కూడా నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment