ఆ కిట్లకు వేలంలో భారీ ధర
న్యూయార్క్: అమెరికా విప్లవం సమయంలో శస్త్ర చికిత్సకు ఉపయోగించిన కిట్‌లు వేలంలో పెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టాయి. దాదాపు రూ.70లక్షల(లక్షా నాలుగువేల డాలర్ల)కు అమ్ముడు పోయాయి. వీటిని అమెరికాకు చెందిన కాంటినెంటల్ ఆర్మీ శస్త్ర చికిత్స నిపుణుడు, హార్వార్డ్ స్కూల్ ఫౌండర్ డాక్టర్ జాన్ వారెన్ ఉపయోగించారు. అయితే, వీటిని ఎవరు కొనుగోలు చేశారనే విషయాన్ని మాత్రం వేలం నిర్వహించిన సంస్థ చెప్పలేదు.
'మేం గత 40 ఏళ్లుగా ఎన్నో వస్తువులను విక్రయిస్తున్నాము. అయితే, చరిత్రలో ప్రసిద్ధమైన ఇలాంటి వస్తువులకు మేం వేలం నిర్వహించడం చాలా అరుదు' అని బోస్టన్‌కు చెందిన వేలం నిర్వహణా సంస్థ ఆర్‌ఆర్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు బాబీ లివింగ్ స్టన్ తెలిపారు. వేలానికి వచ్చినవాళ్లంతా దాదాపు వైద్యులేనని, దేశం నలు మూలల నుంచి వచ్చి ఈ వేలంలో పాల్గొన్నారని.. మునుపెన్నడూ లేనంత ఉత్సాహంగా వేలం పాడారని, అందుకు హార్వార్డ్ మెడికల్ స్కూల్ వ్యవస్థాపకుడు ఉపయోగించిన వస్తువులు కావడమే అందుకు కారణం అని తెలిపారు.