టీ రెక్స్ అంటే.. డైనోసార్ సినిమాల్లో హీరో లెక్క.. దానికో సెపరేటు ఇంట్రడక్షన్ మస్టు. ఇప్పటివరకూ వచ్చిన ఏ డైనోసార్ సినిమా చూసినా దాని తర్వాతే మరెవరైనా.. అలాంటి టీ రెక్స్‌ను సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు మనకు దక్కింది. అంటే.. డైరెక్ట్‌గా రాక్షసబల్లి అని కాదు.. దాని అస్థిపంజరం అన్నమాట. తొలిసారిగా ఆసియాలో ఇదిగో ఈ 43 అడుగుల పొడవు, 16 అడుగుల ఎత్తు ఉన్న టీ రెక్స్‌ను వేలం వేయనున్నారు. 6.8 కోట్ల ఏళ్ల క్రితం జీవించిన ఈ టీ రెక్స్ అస్థిపంజరం ఉత్తర అమెరికాలో జరిపిన తవ్వకాల్లో బయటపడింది. ఇప్పటివరకూ ప్రపంచంలో మరో రెండు టీ రెక్స్‌లను మాత్రమే వేలం వేశారట.
చెప్పడం మరిచాం.. దీని పేరు షెన్ అట. ఏం చూసి ఆ పేరు పెట్టారని మాత్రం అడగకండి.. మాక్కూడా తెలియదు. మీరు గానీ.. దీన్ని కొనుక్కుంటే మీకు నచ్చినట్లుగా అప్పారావ్, సుబ్బారావ్ అని మార్చేసుకోవచ్చు. నవంబర్ 30న హాంకాంగ్‌లో దీన్ని వేలం వేస్తున్నారు. కొనాలన్న ఆసక్తి ఉంటే మాత్రం ఓ రూ.200 కోట్లు రెడీ చేసుకోండి. ఎందుకంటే.. ఈ అస్థిపంజరం ఆ మాత్రం ధర పలుకుతుందని నిపుణులు భావిస్తున్నారు. విషయం అర్థమైందిగా..ఈ అస్థిపంజరం కొనాలంటే.. మన ఆస్తులు అమ్మితే సరిపోదు.. ఇరుగుపొరుగు, బంధుమిత్రుల ఆస్తులు కూడా అమ్ముకొని.. రంగంలోకి దిగాలన్నమాట. మరి రెడీనా..?
చదవండి: అబార్షన్ రూల్స్.. ఏ దేశంలో ఎలా?
Comments
Please login to add a commentAdd a comment