న్యూఢిల్లీ : 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించిన అండర్ వరల్డ్ డాన్, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్తాన్‌లోని కరాచీలో తలదాచుకుంటున్నట్లు ఆధారాలు లభించాయి. దావూద్ పాక్‌లోనే ఉన్నాడన్న భారత్ ఆరోపణలను దాయాది దేశం పదే పదే ఖండించినప్పటికీ, అతడు పాకిస్తాన్‌లోనే తలదాచుకుంటున్నట్లు జీ-న్యూస్ సంచలన కథనాన్ని ప్రచురించింది. గత 25 ఏళ్లుగా పరారీలో ఉన్న దావూద్ ముఖ్య అనుచరుడు, డి-కంపెనీ అంతర్జాతీయ నెట్‌వర్క్‌కు నాయకత్వం వహిస్తున్న జబీర్ మోతీవాలాను దావూద్ కలిసినట్లుగా ఉన్న ఫోటోలు లభించినట్లు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను జీ న్యూస్ విడుదల చేసింది. ఇందులో క్లీన్‌షేవ్‌లో ఉన్న దావూద్‌ను మనం చూడవచ్చు. నిజానికి అతడు మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లుగా గతంలో వార్తలు వచ్చినా.. ప్రస్తుతం ఈ వీడియోలో పూర్తి ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు.
ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సమాచారం ప్రకారం... మోతీవాలా కరాచీలోని దావూద్ ఇళ్లు క్లిఫ్టన్ హౌస్ పక్కనే నివసిస్తున్నాడు. అతను దావూద్ భార్య మెహజబిన్, అతని కుమారుడు మొయిన్ నవాజ్‌లతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నాడు.కాగా వ్యాపారవేత్త ముసుగులో మోతీవాలా దోపిడీలకు పాల్పడటంతో పాటుగా.. హెరాయిన్ స్మగ్లింగ్ చేయడం, మనీలాండరింగ్‌కు పాల్పడ్డాడంటూ ఎఫ్‌బీఐ అతడిని అరెస్టు చేసేందుకు యునైటెడ్ కింగ్‌డమ్ స్కాట్లాండ్ యార్డ్ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోతీవాలా కేవలం వ్యాపారవేత్త మాత్రమేనని, అతడిని అమెరికా ప్రభుత్వానికి అప్పగించలేమని యూకే ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో దావూద్‌తో కలిసి అతడు కరాచీలో ఉన్నట్లుగా వార్తలు రావడం కలకలం రేపుతోంది.
ఇదిలా ఉండగా పాకిస్తాన్‌లో దావూద్ ఉనికి గురించి మోతీవాలా ఇప్పటికే వెల్లడించినట్లు ఎఫ్‌బీఐ సంస్థ తెలిపింది.మోతీవాలా దావూద్ కి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి గనుక అతడి వద్ద డి-కంపెనీ డాన్ గురించి అతని దగ్గర చాలా కీలకమైన సమాచారం ఉంటుందనే నేపథ్యంలో .. డి-కంపెనీ కార్యకలాపాలపై ఎఫ్‌బీఐని సంప్రదించడానికి భారత ఏజెన్సీలు సిద్ధమవుతున్నాయి. కాగా ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రకారం.. ‘మోతీవాలా 10సంవత్సరాలుగా యూకే వీసాతో అక్కడ ఉంటున్నాడు. ఇది 2028తో ముగియనుంది. అయితే గత కొన్ని నెలలుగా అతడు తనతో పాటు కుటుంబ సభ్యులకు ఆంటిగ్వా, బార్బుడా పౌరసత్వాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు దుబాయ్ కంపెనీలో 2 మిలియన్ డాలర్లు జమ చేశాడు’ అని వెల్లడైంది. అయితే దావూద్‌కు పరోక్షంగా సహకరిస్తున్న పాకిస్తాన్.. మోతీవాలాను కాపాడేందుకు యత్నిస్తోంది. మోతీవాలాపై ఎఫ్‌బీఐ మోపిన అభియోగాలను లండన్‌లోని పాకిస్తాన్ హైకమిషన్ వ్యతిరేకించడమే ఇందుకు నిదర్శనం. మోతీవాలా ఒక గౌరవ వ్యాపారవేత్త అని, అతడికి డి-కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ హైకమిషన్ పేర్కొంది. అంతేగాక ఈ మేరకు యూకే వెస్ట్‌మినిస్టర్ కోర్టులో న్యాయమూర్తికి లేఖ ఇచ్చింది. ఈ విషయాలన్నీ నిశితంగా పరిశీలించినట్లైతే మోతీవాలా అరెస్టుతో దావూద్ ఆచూకీ బహిర్గతం అవుతుందని పాక్ ఎంతగా వణికిపోతుందో అర్థమవుతోంది.
ఇక మోతీవాలా ఆచూకీ కనుగొనేందుకు ఎఫ్‌బీఐ అతడితో హెరాయిన్ ఒప్పందం కుదుర్చుకుని ట్రాప్ చేసిన సంగతి తెలిసిందే. దావూద్, మోతీవాల వ్యవహారాలకు సంబంధించి ఇన్ని ఆధారాలు లభించినప్పటికీ పాకిస్తాన్ మాత్రం వారిని వెనకేసుకురావడం చూస్తుంటే ఉగ్రవాదుల పట్ల దాయాది దేశం వైఖరేంటో స్పష్టంగా తెలుస్తుందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment