బాగ్దాద్: ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల వర్గంపై అమెరికా ఆదివారం రాత్రి బాంబుల వర్షం కురిపించింది. సిరియా సరిహద్దుల్లోని అల్ ఖయిమ్ ప్రాంతంలో ఉన్న హెజ్బొల్లా బ్రిగేడ్స్‌కు చెందిన పలు స్థావరాలపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 25 మంది చనిపోయారు. 51 మంది గాయాలపాలయ్యారు. మృతులు, క్షతగాత్రుల్లో పలువురు కమాండర్లు కూడా ఉన్నారు. ఇరాన్ అనుకూల హషెద్ అల్ షాబి సంస్థ విభాగమే హెజ్బొల్లా బ్రిగేడ్స్. ఈ దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదాన్ని అమెరికా ప్రోత్సహిస్తోందని, దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం లేదని మండిపడింది. ఇందుకు అమెరికా మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి అబ్బాస్ మౌసవి హెచ్చరించారు. ఇరాక్‌లోని 3, సిరియాలోని 2 స్థావరాలపై అమెరికా జరిపిన దాడులు విజయవంతమయ్యాయని అమెరికా రక్షణ మంత్రి ఎస్పర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment