అమెరికన్ల జీవితం విభిన్నం | US people culture is more different | Sakshi
Sakshi News home page

అమెరికన్ల జీవితం విభిన్నం

Published Fri, Jul 4 2014 3:00 AM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

అమెరికన్ల జీవితం విభిన్నం - Sakshi

అమెరికన్ల జీవితం విభిన్నం

ఉపాధి కోసం మన భారత ప్రజలు ప్రపంచంలోని వివిధ దేశాలకు విరివిగా వలస వెళుతూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో అమెరికా దేశానికి వస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఇక్కడ వివిధ రంగాల్లో స్థిరపడిన వారి సంఖ్య లక్షల్లోనే ఉంది. ఈ వ్యాసంలో అమెరికన్ల జీవితానికి, మన ప్రజల జీవితానికి గల తేడాలను వివరించేందుకు ప్రయత్నించాను. దీనిని మన ఫ్యామిలీ పేజీలో తప్పకుండా ప్రచురిస్తారని ఆశిస్తున్నాను. అమెరికాలోని ప్రజల జీవన విధానానికి మన ప్రజల జీవన విధానానికి ఎంతో తేడా ఉంది. బిజీ లైఫ్‌లో ఇక్కడి ప్రజలు అన్ని పనులను యంత్రాల ద్వారానే చేసుకుంటున్నారు.

ఇక్కడి ఇళ్లల్లో పని చేసేందుకు పని మనుషులు దొరకరు. ఎవరి పనులు వారే చక్కబెట్టు కోవాలి.భార్య భర్తలిద్దరూ ఉద్యోగులైనపుడు  సమయం దొరకదు. వీకెండ్ రెండు రోజులను రిలాక్స్ అయ్యేందుకు ఉపయోగించుకుంటారు. సముద్రపు బీచ్‌లకు ఇతర ప్రాంతాలకు వెళతారు. మరి కొంత మంది దేవాలాయాలకు వెళతారు. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించారు. మన సంసృ్కతిని, ఆచారాలను తూచ తప్పకుండా పాటిస్తున్నారు. రోజూ వారి పనులను ఎవరికీ వారే చేసుకోవాలి. బట్టలు ఉతకడానికి మన వద్ద ఉన్నట్లు వాష్ ఏరియాలు లేవు. ప్రతి అపార్టుమెంట్‌లో వాషింగ్ మెషిన్లకు ఒక రూంను కేటాయించారు. అక్కడ వాష్ చేసుకునేందుకు కొన్ని బాక్సులను, వాటిని డ్రై చేసేందుకు మరికొన్ని బాక్సులను ఏర్పాటు చేశారు. నెలలో నాలుగు పర్యాయాలు వాషింగ్ మెషిన్ దగ్గరకు వెళ్లి అందులో 1.25 డాలర్లను వేస్తే, ఆ యంత్రమే చక్కగా ఉతికేస్తుంది.వాటిని వెంటనే ఆరవేసేందుకు మరొక మెషిన్‌లో ఉంచితే అదే వాటిని డ్రై చేస్తుంది. ఆ మెషన్‌లో కూడా 1.25 డాలర్లను ఉంచాలి.

ఒక సారి బట్టలు ఉతికేందుకు మన కరెన్సీలో సుమారు 90 రూపాయలు వ్యయం అవుతుంది. ఇక్కడి ప్రజలు సోమరులు కాదు. 60 సంవత్సరాలకు పై బడిన వారు కూడా సూపర్ మార్కెట్లలో పని చేస్తూ కనిపించారు. మహిళలు ఎక్కువ మంది కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలను కూడా నడుపుతున్నారు. అందరికీ కార్లు ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సైకిళ్లపై వెళతారు. లేదా సైకిళ్లను తమ కార్లకు కట్టుకుని పట్టణాల బయట సైకిలింగ్ చేస్తారు. రోడ్లపై పాదచారులు ఒక చోట నుంచి మరో చోటికి దాటేందుకు సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. ఎరుపు రంగులో చేతి గుర్తు చూపినప్పుడు ఆగిపోవాలి. తెల్ల రంగులో వచ్చినప్పుడు రోడ్డు దాటాలి.  ప్రతి చోట పాదచారులకు పుట్ పాత్‌లున్నాయి. మన దేశంలో మాదిరిగా పుట్‌పాత్‌లపై చిన్న చిన్న దుకాణాలు అసలే కనిపించవు. అమెరికాలో క్రమశిక్షణ ఎక్కువ. ఇక్కడికి చదువు కునేందుకు వచ్చిన విద్వార్థి దగ్గర నుంచి లక్షల్లో సంపాదన ఉన్న పారిశ్రామిక వేత్త వరకు ఎవరైనా సరే నిబంధనలు కచ్చితంగా పాటించవలసిందే. సిగ్నల్స్ వద్ద వాహనదారులు ఖచ్చితంగా సిగ్నల్స్ పాటిస్తారు. మన దేశంలో మాదిరిగా సిగ్నల్స్ జంప్ చేయడం వంటివి ఉండవు. రోడ్లు శుభ్రంగా గతుకులు లేకుండా ఉన్నాయి. ప్రతి ఇంటికి కార్లు ఉన్నాయి. కాబట్టి పార్కింగ్ కోసం అన్ని ప్రాంతాల్లోనూ ప్రత్యేక స్థలాలను కేటాయించారు.  నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు అమెరికాలో మంచు విపరీతంగా కురుస్తుంది. ఆ కాలంలో ప్రకృతి అంతా తెల్లని మంచు దుప్పటి కప్పు కుంటుంది. సూర్య రశ్మి రాదు. దీని కోసం ఇక్కడి ప్రజలు తపించి పోతారు. ఎండ వచ్చిన రోజున ఇక్కడి వారికి పండగే.

 ఇంట్లో కొళాయిల్లో వేడి నీరు, చల్లని నీరు వస్తుంది. మంచు కురుస్తున్న రోజుల్లో రోడ్లపై జన సంచారం చాలా తక్కువగా ఉంటుంది. రోడ్లపై ఏర్పడే మంచును ప్రభుత్వ సిబ్బంది ఎప్పటి కప్పుడు తొలగించినప్పటికీ, కార్లు నడపడం కష్టం. అందువల్ల చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో పని చేస్తారు. తమకు కావలసిన సరుకులన్నీ వారానికి ఒక రోజు తీసుకు వస్తారు. ప్రతి ఇంట్లో హీటర్లు తప్పకుండా ఉంటాయి.  

 రోజూ వారీ జీవితం.....
 సాధారణంగా అమెరికాలో కార్యాలయాలన్నీ ఉదయం 8 గంటలకు లేదా 9 గంటలకు ప్రారంభ మవుతాయి. సాయంత్రం 5 లేదా 6 గంటల వరకు పని చేస్తాయి. ఇక్కడ ఎండా కాలంలో సూర్యుడు 9 గంటలకు అస్తమిస్తాడు. మళ్లీ 6 గంటలకు ఉదయిస్తాడు. అమెరికాలో పెద్ద నగరాలు న్యూయార్క్, వాషింగ్టన్ లాంటి నగరాల్లో ప్రజల కోసం పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు, రైళ్లు ఉంటాయి. కొన్ని పట్టణాల్లో సిటీ బస్సులు కేవలం డౌన్ టౌన్ వరకు ఉంటాయి. (అమెరికాలో కార్యాలయాలు ఉండే ప్రాంతాలను డౌన్ టౌన్ అంటారు) మన దేశంలో అధిక జన సాంద్రత కలిగిన ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై,బెంగళూరు, హైదరాబాద్‌లలో అనేక మందికి కార్లు ఉన్నప్పటికీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఉపయోగిస్తారు. అమెరికాలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణ కనిపిస్తుంది. అమెరికాలో ప్రతి వారు వారి వారి ఉద్యోగాలకు తమ సొంత కార్లలోనే వెళతారు. ఉదయం 8 గంటలకు ఆఫీసుకు చేరుకావాలంటే ఇంటి నుంచి 7.15 గంటలకే బయలు దేరతారు.

మన దేశంలో మాదిరిగా తీరిగ్గా క బుర్లు చెప్పుకుంటూ సమయాన్ని వృధా చేయరు. ఉదయం నిద్ర లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని, కాఫీ లేదా టీలో బిస్కట్లు వేసుకుని తింటారు. మరికొందరు బ్రేక్ ఫాస్ట్‌లో పాలలో బార్లీ, ఓట్స్ లాంటివి వేసుకుని వాటిని తినేసి హడావుడిగా బయలు దేరుతారు. మన దేశంలో మాదిరిగా ట్రాఫిక్ జామ్‌లుండవు. కార్యాలయాలకు వెళ్లాక అక్కడున్న చిన్న చిన్న రెస్టారెంట్లలో బ్రెడ్ ముక్కలు, ఆపిల్ పండ్లు, గుడ్లు తింటారు. ఇక మద్యాహ్నాం లంచ్ సమయంలో పిజ్జా లేదా 2 బ్రెడ్ స్లైస్, ఓ కప్ నూడుల్స్, ఒక ప్లేట్ అన్నం, ఒక కర్రీ ఉంటుంది. కొంత మంది ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకుని తింటారు. ఆఫీసులో పర్సనల్ కాల్స్ అటెండ్ చేసేందుకు వీల్లేదు. అత్యవసర కాల్స్ మాత్రం అధికారుల అనుమతితో రిసీవ్ చేసుకుంటారు.

 కారే కీలకం.....
 కారు లేకుండా అమెరికాలో జీవించడం కష్టం. ప్రతి ఇంటికి కార్లున్నాయి. వాటిని పార్క్ చేసేందుకు ప్రత్యేకంగా స్థలాలను కేటాయించారు.చిన్న చిన్న టౌన్ షిప్‌లు, పట్టణాలు నగరాలను చాలా విశాలమైన ప్రదేశాలలో నిర్మించారు. మన హైదరాబాద్ నగరంలో పేటలు, గల్లీలు ఉన్నట్లుగానే ఇక్కడ కౌంటీలుంటాయి. ఉదాహరణకు మనకు తెలిసిన న్యూజెర్సీ అనేది ఒక రాష్ర్టం. ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నారు. సోమర్‌సెట్,బ్రిడ్జ్‌వాటర్,విల్లే, మోర్గాన్, ప్లెన్స్‌బరో, బ్రౌన్స్‌వీక్, జెర్సీసిటీ, ఎడిసన్ అనే పట్టణాలున్నాయి. అదే విధంగా శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో సన్నివేల్, యన్‌యన్‌సిటీ, ఫ్రీమాంట్, మిల్‌పెటాన్, శాన్‌హెసె అనే పట్టణాలున్నాయి. ఈ పట్టణాలన్నీ ఒకదాని కొకటి 15-20 మైళ్ల దూరంలో ఉన్నాయి. ప్రతి వ్యక్తి ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు, పిల్లలను స్కూల్లో వదిలి పెట్టేందుకు, ఇతర పనులకు సుమారు వంద మైళ్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇతర పనులపై వేరే నగరాలకు వెళ్లినా ఇక్కడ ఎయిర్‌పోర్టులలో కార్లను అద్దెకు తీసుకుని పనులు ముగించుకుని కార్లను వాపసు ఇచ్చేస్తారు. విద్యార్థిగా ఉన్న వారు కూడా పార్ట్ టైం జాబ్ చేసేందుకు సెకండ్‌హైండ్ కారు కొనుక్కుంటారు.

 కారులో నుంచి పనులు చక్కబెట్టుకుంటారు....
 కారులోంచి దిగకుండా దారిలోనే రెస్టారెంట్ దగ్గర కాఫీ, లేదా స్నాక్స్ కొనుక్కుని తింటారు. డ్రైవ్ రెస్టారెంట్లలో ఒక కిటికీలో ఆర్ఢర్ ఇస్తారు. మరో కిటికీలో తాము కొనుక్కున్న వస్తువులను తీసుకుంటారు. అదే విధంగా డ్రైవ్ త్రూ బ్యాంక్‌లో చెక్కులు డిపాజిట్ చేస్తారు. డ్రైవ్ త్రూ ఫార్మసీలో తమకు కావలసిన మందులను కొనుక్కుంటారు. కారులోనే కూర్చుని అన్నీ పనులను చక్కబెట్టుకుంటారు.      


 వ్యాయామానికి అత్యధిక ప్రాధాన్యం.....
 అమెరికన్లు వ్యాయామానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తారు. అనేక మంది రోడ్లపై జాగింగ్ చేస్తారు. ప్రతి అపార్టుమెంట్‌లో స్విమ్మింగ్‌పూల్స్ ఉన్నాయి. ఇతర వ్యాయామాలకు అడుగడుగునా జిమ్స్ ఉన్నాయి. ప్రతి గురువారం సాయంత్రం ఇక్కడ సంగీత కచేరీలు జరుగుతాయి. ఎవరి మడత కుర్చీలను వారే తెచ్చుకుంటారు. స్నాక్స్ తింటూ బీరు తాగుతూ చాలా జాలీగా గడుపుతారు. ఇక బీచుల్లో స్నానం చేసి, ఎండకు శరీరాన్ని ఆరబెట్టుకుంటారు. అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. జనాభా 31,38,47,465. విస్తీర్ణం-35,39,225 స్కేర్ మైళ్లు. 50 సంవత్సరాలుగా అమెరికా దేశానికి మన దేశ ప్రజలు వలస రావడం ప్రారంభమైంది.

ఇక్కడ మన ప్రజలు అన్ని రంగాల్లో స్థిర పడ్డారు. సిలికాన్ వేలీలో కూడా కీలకమైన పదవులు నిర్వహిస్తున్నారు. మన దేశంలోని ప్రతి పది కుటుంబాల్లో ఒక కుటుంబానికి చెందిన వారు ఇక్కడ నివసిస్తున్నారు. గుజరాత్ తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఇక్కడ అత్యధికంగా నివసిస్తున్నారు. ఎయిర్ ఇండియా ఇక్కడికి రెగ్యులర్‌గా విమానాలను నడుపుతోంది. ఇదిలా ఉండగా భూగోళానికి ఆవలి వైపున,  వేల మైళ్ల దూరంలోని తమ బంధువులతో మాట్లాడేందుకు ఇంటర్‌నెట్‌లోని ‘స్కైపీ’ని ఉపయోగించుకుంటున్నారు. ఆదునికి సాంకేతిక పరిజ్ఞానం విరివిగా అందుబాటులోకి వచ్చిన కారణంగా మానసికంగా అమెరికాలోని మన ప్రజలకు, భారత్‌లోని వారి బంధువులకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ప్రతి రోజూ క్షేమ సమాచారాన్ని తెలుసుకుని తృప్తి పడుతున్నారు. గతంలో ఫోన్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకునేందుకు వందల రూపాయలు వ్యయం చేయవలసి వచ్చేది.

అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో ఈ ఏడాది ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు 1,13,813 మంది విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ఐసీటీ) విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నివేదిక ప్రకారం అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు రెండవ స్థానంలో ఉన్నారు. 2,90,133 మంది విద్యార్థులతో చైనా మొదటి స్థానంలో ఉంది.
 అమెరికా నుంచి-జి.గంగాధర్ (సిర్ప) సీనియర్ సబ్ ఎడిటర్ ‘సాక్షి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement