పాక్ డిప్యూటీ చైర్మన్‌కు అమెరికా అవమానం
ఇస్లామాబాద్: అమెరికా నుంచి పాకిస్థాన్ సెనేట్ డిప్యూటీ చైర్మన్‌కు చుక్కెదురైంది. ఆయనకు వీసా ఇచ్చేందుకు అమెరికా ఎంబసీ నిరాకరించింది. అమెరికాలో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఓ కార్యక్రమానికి పాక్ నుంచి సెనేట్ డిప్యూటీ చైర్మన్ మౌలానా అబ్దుల్ ఘఫూర్ హైదేరి వెళ్లాల్సి ఉంది. పాక్ ప్రతినిధిగా ఆయన ఆ సమావేశానికి హాజరు కావాలి.
ఈ కార్యక్రమం మరో వారంలో జరగనుంది. ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ) పేరిట ఐక్యరాజ్యసమితి ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తోంది. దీనికి హాజరయ్యేందుకే ఆయన వీసా దరఖాస్తు చేసుకోగా నిరాకరించారు. దీంతో ఆయన ఏకంగా ఈ కార్యక్రమానికి తాను బైకాట్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు ఇక నుంచి అమెరికా నుంచి వచ్చే దౌత్య బృందాలకు పాక్ సెనేట్ నుంచి ఎలాంటి గౌరవ మర్యాదలు, అతిథ్యపూర్వక కార్యక్రమాలు ఉండబోవని ప్రకటించింది.