న్యూయార్క్ : ట్రంప్ యంత్రాంగం అనుసరిస్తున్న వలస వ్యతిరేక విధానం సత్ఫలితాలు ఇస్తోందని అమెరికా స్పష్టం చేసింది. అమెరికాలో పనిచేసేందుకు నైపుణ్యాలతో కూడిన భారత ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఉపకరించే హెచ్1బీ వీసాల ఆమోదం 2018లో పది శాతం తగ్గిందని అమెరికన్ అధికారులు వెల్లడించారు. 2018 ఆర్ధిక సంవత్సరంలో నూతన, రెన్యూవల్ కలుపుకుని 3.35 లక్షల హెచ్-1బీ వీసాలకు అమెరికన్ పౌరసత్వ, వలస సేవల (యూఎస్‌సీఐఎస్) విభాగం ఆమోదం తెలపగా 2017లో ఈ సంఖ్య 3.73 లక్షలు కావడం గమనార్హం.
2017లో హెచ్1బీ వీసాలకు ఆమోదం రేటు 93 శాతం నుంచి 2018లో 85 శాతానికి తగ్గిందని గణాంకాలు వెల్లడించాయి. హెచ్1బీ వీసాలపై ట్రంప్ యంత్రాంగం చేపట్టిన నియంత్రణల ప్రభావం ఈ గణాంకాలపై అధికంగా ఉందని వలస విధాన సంస్థ విశ్లేషకులు సారా పీర్స్ వ్యాఖ్యానించారు. నైపుణ్యాలతో కూడిన ప్రొఫెషనల్స్‌ను హెచ్1బీ వీసా ద్వారా అమెరికన్ కంపెనీలు హైర్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment