ఐటీపై ట్రంప్ పిడుగు | donald trump will effects on software companies | Sakshi
Sakshi News home page

ఐటీపై ట్రంప్ పిడుగు

Published Wed, Feb 1 2017 3:21 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ఐటీపై ట్రంప్ పిడుగు - Sakshi

ఐటీపై ట్రంప్ పిడుగు

  • అన్నంత పనిచేసిన అమెరికా అధ్యక్షుడు
  • హెచ్‌–1బీ వీసాలపై ఉక్కుపాదం
  • అమెరికా ప్రతినిధుల సభలో హెచ్‌–1బీ వేతన సవరణ బిల్లు
  • వీసాదారుల కనీస వేతనం 60 వేల నుంచి 1.30 లక్షల డాలర్లకు పెంపు
  • అలా చెల్లించకుంటే అమెరికన్లనే నియమించాలంటూ నిబంధన
  • 50 కంటే తక్కువ ఉద్యోగులున్న కంపెనీలకు వీసాలు బంద్‌
  • హెచ్‌–1బీ వీసాల్లో 20 శాతం స్టార్టప్‌ కంపెనీలకు..
  • బిల్లు ఆమోదం పొందితే భారత ఐటీకి శరాఘాతమే

  • వాషింగ్టన్‌:
    అంతా భయపడ్డట్టే జరిగింది! భారత ఐటీపై ట్రంప్‌ పిడుగు పడింది!! వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచానికి వరుస షాక్‌లు ఇస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా వీసా బాంబు పేల్చారు. భారత ఐటీ ఉద్యోగులు, కంపెనీల్ని టార్గెట్‌ చేస్తూ హెచ్‌–1బీ వీసాలపై పలు కఠిన నిబంధనలు విధించారు. ఈ మేరకు రూపొందించిన బిల్లును మంగళవారం అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం... హెచ్‌–1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల వేతనాన్ని రెండింతలు పెంచాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో తక్కువ వేతనాలకు పనిచేస్తున్నవారి స్థానంలో తప్పనిసరిగా అమెరికన్లనే నియమించాలి. ఈ బిల్లును అమెరికన్‌ కాంగ్రెస్‌లోని ఉభయ సభలు ఆమోదిస్తే భారత ఐటీ రంగానికి శరాఘాతమేనని నిపుణులు చెబుతున్నారు.

    ఏమిటా బిల్లు.. అందులో ఏముంది?
    ‘ద హై స్కిల్డ్‌ ఇంటిగ్రిటీ అండ్‌ ఫెయిర్‌నెస్‌ యాక్ట్‌ 2017’పేరుతో ఈ బిల్లును రూపొందిం చారు. దీన్ని కాలిఫోర్నియా కాంగ్రెస్‌ సభ్యురాలు జోయ్‌ లోఫ్‌గ్రెన్‌ మంగళవారం అమెరికాలో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ప్రకారం.. హెచ్‌–1బీ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న వారికి ఏడాదికి కనీసం లక్షా 30 వేల డాలర్లు (దాదాపు రూ.88 లక్షలు) చెల్లించాలి. ప్రస్తుతం హెచ్‌–1 బీ వీసాదారులకు కనీస వేతనం 60 వేల డాలర్లు(రూ.40.80 లక్షలు)గా ఉంది. 1989 నుంచి ఈ మొత్తంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పుడు ఏకంగా 200 శాతం వేతనం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీలకే మార్కెట్‌ ఆధారంగా వీసాలు కేటాయించాలని బిల్లులో పొందుపరిచారు. తక్కువ వేతనం చెల్లింపు నిబంధనను తొలగించాలని ప్రతిపాదించారు.

    బిల్లు ఆమోదం పొందితే...?
    ఒకవేళ ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందితే వార్షిక వేతనం లక్షా 30 వేల డాలర్ల కంటే తక్కువ పొందే విదేశీ ఐటీ ఉద్యోగులకు ఇక్కట్లు తప్పవు. వారిని తొలగించి వారి స్థానాల్లో అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలని బిల్లులో పేర్కొన్నారు. ఇక 50 మంది కంటే తక్కువ మంది ఉద్యోగులు పనిచేసే చిన్న కంపెనీలకు 20 శాతం వీసా కోటాను కూడా తొలగిస్తారు. కంపెనీల్లో ఏవైనా ఖాళీలుంటే హెచ్‌–1బీ, ఎల్‌–1 వీసాదారుల కంటే ముందుగా నిపుణులైన అమెరికన్లనే పరిగణలోకి తీసుకోవాలి. చట్టం అమలులో మోసం, దుర్వినియోగం జరిగితే కార్మిక విభాగం, హోం ల్యాండ్‌ భద్రతా విభాగాలు విచారణకు రంగంలోకి దిగుతాయి. ఈ మేరకు వాటికి అదనపు అధికారాలు కట్టబెట్టారు. అలాగే బిల్లులో పేర్కొన్న నిబంధనలు పాటించని కంపెనీలకు జరిమానాలు కూడా పెంచుతారు.

    ఆ వీసాలు అమెరికన్ల ఉద్యోగాల భర్తీకి కాదు..
    బిల్లుపై కాంగ్రెస్‌ సభ్యుడు లోఫ్‌గ్రెన్‌ మాట్లాడుతూ... ‘‘హెచ్‌–1బీ పథకం ఏర్పాటు అసలు లక్ష్యంపై దృష్టి పెట్టేందుకు నేను ప్రవేశపెట్టిన బిల్లు దోహదం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రతిభావంతులు, నిపుణుల్ని ఉద్యోగాల్లో నియమించుకోవచ్చు. అమెరికా మానవ వనరులకు లబ్ధి చేకూర్చడంతో పాటు కొత్త ఉద్యోగాల కల్పనలో అధిక వేతనం పొందే నైపుణ్యవంతులు ఉపయుక్తంగా ఉంటారు. హెచ్‌–1బీ వీసాలు అమెరికన్ల ఉద్యోగాలను భర్తీ చేయడానికి కాదు’’అని పేర్కొన్నారు. ఈ బిల్లు ద్వారా... ఎక్కువ జీతం చెల్లించేందుకు ఆసక్తి ఉన్న కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా మార్కెట్‌ ఆధారిత పరిష్కారం సాధ్యమవుతుందని ఆమె చెప్పారు. అలాగే అమెరికన్‌ కంపెనీలు వారికి అవసరమైన ప్రతిభావంతుల్ని ఎంపిక చేసుకోవచ్చన్నారు. అమెరికన్ల ఉద్యోగుల జీతాల్లో కోతపెట్టే, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ప్రోత్సహించే కంపెనీలకు ప్రోత్సహకాలు తొలగించాలని కూడా బిల్లులో సూచించారు.

    దేశాలకు వీసా పరిమితులు తొలగిపోతాయి
    వర్క్‌ వీసాల సంఖ్యపై దేశాలకు విధించిన పరిమితి ఈ బిల్లుతో తొలగిపోనుంది. ఈ మేరకు లోఫ్‌గ్రెన్‌ వెల్లడించారు. ‘‘వర్క్‌ వీసాలపై పరిమితి తొలగిపోతుంది. అందువల్ల ఉద్యోగుల ఎంపికలో మరింత నిష్పాక్షికంగా ఉండొచ్చు. జాతీయత ఆధారంగా కాకుండా ప్రతిభను బట్టి ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చు’’అని ఆమె వివరించారు. హెచ్‌–1బీ వీసాల్లో 20 శాతం స్టార్టప్‌లకు కేటాయించాలని బిల్లులో రూపొందించారు. ఈ నిర్ణయం చిన్న కంపెనీలు ప్రతిభావంతుల కోసం పోటీపడేందుకు అవకాశం కల్పిస్తుందని లోఫ్‌గ్రెన్‌ చెప్పారు. విద్యార్థులు, ఇతర తాత్కాలిక వీసాదారులకు వీసా పొందేందుకు ఉన్న ఇబ్బందులు తొలగించేలా, కంపెనీలు ఉద్యోగుల వేతనాలు తగ్గించకుండా కట్టుదిట్టమైన నిబంధనలను బిల్లులో పొందుపరిచారు.

    సెనెట్‌లోను ప్రవేశపెడతాం
    హెచ్‌–1బీ, ఎల్‌–1 వీసాల సంస్కరణల బిల్లును సెనెట్‌లోనూ ప్రవేశపెడతామని చట్టసభ సభ్యుడు షెరాడ్‌ బ్రౌన్‌ తెలిపారు. ఈ వీసాల పథకంలో లోపాల్ని తొలగించడంతోపాటు, అమెరికన్‌ ఉద్యోగులు, వీసాదారులకు ఈ బిల్లు భద్రత కల్పిస్తుందన్నారు. ‘‘అమెరికన్లకు సరైన వేతనాలు చెల్లించకుండా, విదేశీ ఉద్యోగుల్ని దోచుకుంటున్న కంపెనీలపై కొరడా ఝలిపించాల్సిన అవసరం ఉంది’’అని బ్రౌన్‌ పేర్కొన్నారు. హెచ్‌–1బీ, ఎల్‌–1 వీసా పథకంలో అక్రమాలపై విచారణ జరిపిస్తామని, సంస్కరణలు తెస్తామని ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ ఇచ్చిన హామీ ఈ చట్టంతోనే ప్రారంభమవుతుందన్నారు.

    ఎవరేమన్నారు..?
    అమెరికా అధికారులతో మాట్లాడాం: భారత్‌
    బిల్లుపై ఐటీ కంపెనీలు, ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో భారత్‌ స్పందించింది. భారత్‌ ప్రయోజనాలు, ఆందోళనను అమెరికా ప్రభుత్వం, అక్కడి కాంగ్రెస్‌కు తెలియచేశామని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ తెలిపారు.

    60 నుంచి 70 శాతం జీతాలు పెంచాలి: ఏంజెల్‌ బ్రోకింగ్‌
    హెచ్‌–1బీ వీసాలపై తెచ్చిన నిర్ణయంతో భారతీయ కంపెనీలు దాదాపుగా 60 నుంచి 70 శాతం వరకూ జీతాలు పెంచాల్సి వస్తుందని ఏంజెల్‌ బ్రోకింగ్‌ సంస్థ పేర్కొంది. ఇది కంపెనీల నికరలాభంపై ప్రభావం చూపుతుందని వివరించింది.

    కంపెనీలపై వ్యతిరేక ప్రభావం: గార్టెన్‌ రీసెర్చ్‌ డైరక్టర్‌
    నిపుణుల కోసం ఖర్చు పెరగడంతో పాటు, స్థానికుల్ని మరింత మందిని నియమించుకోవాలని గార్టెన్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ డీడీ మిశ్రా పేర్కొన్నారు. ‘‘సేవల కొనసాగింపులో గందరగోళం నెలకొనవచ్చు. ఇవన్నీ కంపెనీల లాభంపై వ్యతిరేక ప్రభావం చూపుతాయని’’ఆయన అన్నారు.

    కంపెనీలపై 10 శాతం ప్రభావం: గ్రేహౌండ్‌ రీసెర్చ్‌
    ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న హెచ్‌–1బీ వీసాదారుల సంఖ్య ఆధారంగా ఐటీ కంపెనీలపై 5–10 శాతం వరకూ ప్రభావం పడవచ్చని గ్రేహౌండ్‌ రీసెర్చ్‌ తెలిపింది. తమ ఆదాయంలో సగం అమెరికా నుంచే పొందుతున్న టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు మాత్రం ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాకరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement