వీసా చట్టం.. భారత్ పై ప్రతికూల ప్రభావం!
సాక్షి నాలెడ్జ్ సెంటర్
ఏమిటీ చట్టం?
‘అధిక నైపుణ్య సరళత, నిష్పాక్షికత చట్టం’ను అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. ఇది వలస ఉద్యోగుల కోసం హెచ్-1బి వీసాలను స్పాన్సర్ చేసే సంస్థలు.. ఆ ఉద్యోగులకు 1.30 లక్షల డాలర్ల కనీస వార్షిక వేతనం చెల్లించటం తప్పనిసరి చేసే చట్టం. ప్రస్తుతం 60 వేల డాలర్లుగా ఉన్న ఈ కనీస వేతనాన్ని ఏకంగా 200 శాతం పెంచాలని ఇందులో ప్రతిపాదించారు.
ప్రభావం ఎవరిపై?
అమెరికా ఉద్యోగాల మార్కెట్‌లోకి విదేశీ ఉద్యోగుల వరదను అరికట్టడం ద్వారా.. అమెరికన్ల ప్రయోజనాలను పరిరక్షించడం ఈ సంస్కరణల లక్ష్యం. అమెరికా ప్రతి ఏటా 85,000 హెచ్-1బి వీసాలు జారీ చేస్తుంది. అందులో 60 శాతం దరఖాస్తులు భారతీయులవే. ఉన్నత డిగ్రీల కోసం అమెరికా వలస వెళ్లే భారత విద్యార్థులు, విదేశీ ప్రాజెక్టుల కోసం ఉద్యోగులను పంపించే భారత టెక్ కంపెనీలపై ఈ చట్టం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.
భారత్‌పై ప్రభావం ఎలా?
ఈ చట్టం ఇంకా ఆమోదం పొందకముందే.. భారత మార్కెట్లపై ప్రభావం చూపింది. ప్రధాన టెక్ కంపెనీల షేర్ల విలువల పడిపోయాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ సంస్థలకు గట్టి దెబ్బతగిలింది. అంతేకాదు.. ఈ చట్టం ఫలితంగా అమెరికా యూనివర్సిటీలపై భారత విద్యార్థుల ఆసక్తి కూడా సన్నగిల్లి.. మేధో వలస తగ్గే అవకాశం ఉంటుంది.
అమెరికా వీసాను తిరస్కరిస్తారా?
నిజంగా విద్యాభ్యాసం కోసం వెళ్లే విద్యార్థులకు సంబంధించినంత వరకూ తిరస్కరించరు. అలాగే.. ఎఫ్-1 విద్యార్థి వీసా హోదా నుంచి చట్టబద్ధ శాశ్వత నివాసానికి ఒక వారధిని కూడా నెలకొల్పాలని ఈ చట్టంలో ప్రతిపాదించారు. కాబట్టి.. దరఖాస్తుదారుకు అమెరికా వలసరావాలన్న ఉద్దేశం ఉందన్న ఏకైక కారణం ప్రాతిపదికగా వీసాలను తిరస్కరించడం జరగదు. ఓ-1 (అసాధారణ సామర్థ్యం), పీ (క్రీడాకారులు, కళాకారులు, వ్యాపారవేత్తలు), స్వేచ్ఛా వాణిజ్య వీసాదారులకు కూడా ఇది వర్తిస్తుంది.
బిల్లు ఆమోదం పొందుతుందా?
అమెరికా కాంగ్రెస్ ఉభయసభలు – సెనేట్, ప్రతినిధుల సభ – రెండిట్లోనూ రిపబ్లికన్ల ఆధిక్యం ఉండటంతో ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశముంది. అదీగాక.. ఈ బిల్లును ప్రవేశపెట్టింది కాలిఫోర్నియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలు కావడం గమనార్హం. ఈ బిల్లు ఆమోదం పొందితే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.
అమెరికన్లకు ఎలా ప్రయోజనం?
హెచ్-1బి వీసా పొందడానికి కనీస వేతనం భారీగా పెంచడం వల్ల.. విదేశీ ఉద్యోగులను అమెరికాలో నియమించే భారతీయ సంస్థలపై భారం పెరుగుతుంది. తద్వారా అవి అమెరికాలో స్థానికంగానే ఎక్కువ నియామకాలు చేపట్టే దిశగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.
భారత పరిశ్రమ ప్రాధాన్యత ఎంత?
నాస్కామ్ అంచనాల ప్రకారం.. అమెరికా ఆర్థిక వ్యవస్థలో భారత హెచ్-1బి, ఎల్-1 వీసాదారుల వాటా ఏటా 100 కోట్ల డాలర్లు ఉంటుంది. భారత ఐటీ రంగం అమెరికాలో 4 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. తద్వారా అమెరికాకు ఏటా 500 కోట్ల డాలర్ల మేర పన్నులు అందిస్తున్నాయి.