అమెరికాలో ఉద్యోగులకూ తిప్పలు | H1B visa with Indian employees problems fased with CBP | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఉద్యోగులకూ తిప్పలు

Published Fri, Jan 8 2016 7:36 AM | Last Updated on Wed, Sep 26 2018 6:44 PM

అమెరికాలో ఉద్యోగులకూ తిప్పలు - Sakshi

అమెరికాలో ఉద్యోగులకూ తిప్పలు

హెచ్1బీ వీసాపై వెళ్లినవారినీ వెనక్కి పంపుతున్న సీబీపీ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో భారత విద్యార్థులకే కాదు.. హెచ్1బీ వీసాతో ఇప్పటికే ఉద్యోగాల్లో కొనసాగుతున్నవారికీ ఇబ్బందులు తప్పడం లేదు. హెచ్1బీ వీసాను స్టాంపింగ్ చేయించుకోవడానికో, సెలవుల్లో గడిపేందుకో స్వదేశానికి వస్తున్నవారిని.. తిరిగి వెళ్లినప్పుడు విమానాశ్రయాల నుంచే కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) వెనక్కి తిప్పిపంపుతోంది. గత రెండు నెలల్లో దాదాపు 500 మందిని ఈ రకంగా వెనక్కి పంపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అమెరికాలో ప్రస్తుతం పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని.. భారతీయ ఉద్యోగులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అమెరికా కన్సల్టెన్సీ సంస్థలు సూచిస్తున్నాయి.

దీంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో అమెరికా నుంచి భారత్‌కు వచ్చేందుకు టికెట్లు బుక్ చేసుకున్న దాదాపు 6 వేల మంది తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవడమో, రద్దు చేసుకోవడమో జరిగిందని ప్రముఖ ట్రావెల్ వెబ్‌సైట్ ‘మేక్ మై ట్రిప్’ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రయాణాలు వాయిదా వేసుకుంటు న్న వారు 50 శాతానికిపైగా పెరిగారన్నారు.
 
కారణాలూ చెప్పలేదు..
‘నేవార్క్‌లోని మిడ్‌సైజ్ దేశీ కన్సల్టింగ్ కంపెనీలో పనిచేస్తున్నాను. హెచ్1బీ వీసా స్టాంపిం గ్ చేయించుకోవడానికి 15 రోజుల క్రితం ఇండియా వచ్చి సెలవుల అనంతరం అమెరికా వెళ్లా. అక్కడి నేవార్క్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఆఫీసర్ నన్ను నిలువరించారు. నన్ను వెనక్కి పంపుతున్నామంటూ నా చేతిలో ఫారమ్-275 పెట్టారు. కారణాలేమిటనేది వివరించలేదు. ఆ సమయంలో సీబీపీ అధికారి వ్యవహరించిన తీరు చాలా ఇబ్బందికరంగా ఉంది.

నలుగురైదుగురు అధికారులు అవహేళనగా మాట్లాడారు..’’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చెప్పారు. తన హెచ్1బీ వీసాను రద్దు చేయడమే కాకుండా ఐదేళ్ల పాటు అమెరికా వెళ్లేందుకు వీల్లేకుండా నిషేధం విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా లో తాను పనిచేస్తున్న కంపెనీ దీనిని సీరియస్‌గా తీసుకుందని, అక్కడి న్యాయస్థానంలో వారు పిటిషన్ దాఖలు చేస్తున్నారని తెలిపారు. గతంలో తమ కంపెనీకి చెందిన ఇద్దరు భారత ఉద్యోగులకు న్యాయస్థానం ద్వారా ఊరట లభించిందన్నారు. నకిలీ సర్టిఫికెట్ పెట్టకపోయినా ఇలా వ్యవహరించారని పేర్కొన్నారు.
 
నకిలీ సర్టిఫికెట్లతో మొదటికే మోసం
అమెరికా వెళ్లి ఎంఎస్ చేస్తున్న వారిలో 90 శాతం అక్కడ ఉద్యోగాలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యా ప్రమాణాలు బాగున్నాయనో, అక్కడ పరిశోధన చేసి డాక్టరేట్ సంపాదించాలనో వెళుతున్నవారు 10 శాతమే ఉంటున్నారు. జీఆర్‌ఈ, టోఫెల్‌లో మంచి స్కోర్ సాధించి టాప్-100 విశ్వవిద్యాలయాల్లో చేరినవారు మినహా మిగతావారంతా ఉద్యోగాల కోసం కన్సల్టెన్సీల మీద ఆధారపడుతున్నారు. ఉద్యోగం ఇప్పించేం దుకు కన్సల్టెన్సీలు ముందే ఉద్యోగ అనుభవం ఉన్నట్లు నకిలీ సర్టిఫికెట్లు పెడుతున్నాయి.

ఎంఎస్ పూర్తయిందే అప్పుడైతే.. మూడు నాలుగేళ్లు అనుభవమున్నట్లు వాటిల్లో చూపుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్ పరిశ్రమ, ఇతర రంగాల్లో పనిచేస్తున్న వారిలో చాలా మంది ఇలా ఉద్యోగాల్లో చేరినవారే. కానీ అలా హెచ్1బీ వీసాతో ఉద్యోగాలు చేస్తు న్న కొందరు.. తాజాగా సీబీపీ అధికారుల తనిఖీల్లో దొరికిపోతున్నారు. గత మూడు, 4 నెలల్లో ఇలాంటి చాలా మంది ఉద్యోగులను వెనక్కి పంపినట్లు సమాచారం. కానీ కచ్చితమైన వివరాలు తెలియవు. ‘‘ఏడాది క్రితం ఎంఎస్ పూర్తి చేశా.

ఓ కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగంలో చేరాను. గతేడాది నవంబర్‌లో హెచ్1బీ వీసా వచ్చాక ఎర్నెస్ట్ అండ్ యంగ్‌లో ఫుల్‌టైమ్ ఉద్యోగం వచ్చింది. సెలవులతో పాటు హెచ్1బీ వీసా స్టాంపింగ్ కోసం ఇటీవలే చెన్నై వచ్చాను. తిరిగి వెళ్లినప్పుడు డల్లాస్‌లో సీబీపీ అధికారులు ఆపారు. కన్సల్టెంట్ ద్వారా ఉద్యోగంలో చేరినప్పుడు నకిలీ అనుభవం సర్టిఫికెట్ పెట్టావంటూ హెచ్1బీ వీసా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. చేసేది లేక వెనక్కి వచ్చేశాను..’’ అని తమిళనాడుకు చెందిన ముత్తురామన్ ఓ వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు.
 
అన్ని డాక్యుమెంట్లు దగ్గరే ఉంచుకోవాలి..

‘‘హెచ్1బీ వీసా ఉన్న ఉద్యోగులు భారత్‌కు వచ్చి తిరిగి వెళ్లేటప్పుడు అన్ని డాక్యుమెంట్లు దగ్గర ఉంచుకోవాలి. సీబీపీ అధికారులు అనుమానం వచ్చి డాక్యుమెంట్లు అడిగితే చూపాలి. ప్రశ్నలు సంధిస్తే తడుముకోకుండా సమాధానమివ్వాలి. అమెరికా ఎందుకు వచ్చావని అడిగితే తాను ఫలానా అసైన్‌మెంట్ మీద వచ్చానని దానికి సంబంధించి పత్రాలు చూపాలి. కంపెనీలో హోదా ఏమిటి, ఎవరికి రిపోర్టు చేస్తారనే వివరాలను చెప్పాలి. అకస్మాత్తుగా కంపెనీలో ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారని అడిగితే తెలియదనో లేదా సెలైంట్‌గా ఉండటమో చేయవద్దు. మామూలుగా సీబీపీ అధికారులకు అనుమానం వస్తే తరచుగా అడిగే ప్రశ్న ఇది. నువ్వు నేరుగా ఉద్యోగం చేస్తున్నావా లేదా క్లయింట్ దగ్గర చేస్తున్నావా అనే ప్రశ్నకు చాలా మంది పొరబడి తప్పుడు సమాధానం చెప్పి ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ సూచనలు పాటిస్తే ఇబ్బందులు ఉండవు..’’                      
- జ్యోతిరెడ్డి, కీ సొల్యుషన్స్ సీఈవో, అరిజోనా, అమెరికా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement