అమెరికాలో దారుణం | USA Four persons have been killed in the firing by thugs | Sakshi
Sakshi News home page

అమెరికాలో దారుణం

Published Wed, May 1 2019 4:10 AM | Last Updated on Wed, May 1 2019 4:43 AM

USA Four persons have been killed in the firing by thugs  - Sakshi

సిన్సినాటి: అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకే సిక్కు కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం రాత్రి ఓహియో రాష్ట్రంలో చోటుచేసుకుంది. సిన్సినాటిలోని వెస్ట్‌చెస్టర్‌ టౌన్‌షిప్‌కు చెందిన హకీకత్‌ సింగ్‌ పనాగ్, ఆయన భార్య పరమ్‌జిత్‌ కౌర్, కూతురు షాలిందర్‌ కౌర్, కోడలు అమర్జిత్‌ కౌర్‌ ఆదివారం రాత్రి భోజనానికి ఉపక్రమిస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వారంతా అక్కడికక్కడే చనిపోయారు.

కొద్దిసేపటి అనంతరం ఇంటికి చేరుకున్న హకీకత్‌సింగ్‌ కుమారుడు కుటుంబసభ్యులు రక్తపు మడుగులో పడి ఉండటం గమనించి వెంటనే 911 పోలీస్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేశారు. ‘మృతుల్లోనే నేరగాడు ఉన్నట్లు గానీ, ఎదురుకాల్పులు జరిగినట్లు గానీ మేం భావించడం లేదు. ఈ ఘటనకు కారణాలు, కారకులెవరు అనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుల కోసం గాలిస్తున్నాం’ అని పోలీస్‌ చీఫ్‌ హెర్జోగ్‌ అన్నారు. ఈ ఘటనపై వెస్ట్‌ చెస్టర్‌లోని గురునానక్‌ సొసైటీ ఆఫ్‌ గ్రేటర్‌ సిన్సినాటి ప్రెసిడెంట్‌ జస్మిందర్‌ సింగ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.‘హకీకత్‌ సింగ్‌ పనాగ్‌ చాలా గొప్ప వ్యక్తి. ఆయనది చాలా మంచి కుటుంబం’ అని తెలిపారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement