ఇంటర్నెట్ లేకుండానే 'ఫేస్ బుక్'..!
న్యూఢిల్లీః ఫేస్ బుక్ వినియోగదారులకు శుభవార్త! ఇప్పుడు భారతదేశంలోని యూర్లంతా స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ కనెక్షన్, డేటా బ్యాలెన్స్ లేకపోయినా ఫేస్ బుక్ ను వాడుకునే సౌకర్యం కల్పిస్తోంది. *325# డయల్ చేస్తే చాలు కనెక్ట్ అయిపోయే కొత్త సేవలను ఫేస్ బుక్ అందుబాటులోకి తెచ్చింది.
వినియోగదారులకు ఫేస్ బుక్ మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ లేకపోయినా, డేటా బ్యాలెన్స్ లేకపోయినా ఫేస్ బుక్ లోకి ఎంటరయ్యే కొత్త సేవలను ప్రారంభించింది. ఫేస్ బుక్ ఇండియా, ఫోనెట్ విష్ భాగస్వామ్యంతో ఈ తాజా అవకాశాన్ని కల్సిస్తోంది. అన్ స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ డేటా (యుఎస్ఎస్ డీ) ఆధారిత ఫోనెట్ విష్ ఇంటరాక్టివ్ సర్వీస్... డేటా కనెక్షన్ లేకుండానే ఈ సేవలను అందిస్తుంది. అంతేకాక ఫేస్ బుక్ స్టేటస్ ను కూడా ఉచితంగా చూసుకోవచ్చు. అయితే ఇందులో పోస్టింగ్ లు, నోటిఫికేషన్ల పరిశీలన, యాడ్ ఫ్రెండ్స్ వంటి వాటికి మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కేవలం రోజుకు ఒక్క రూపాయి చెల్లిస్తే ఈ సౌకర్యాన్ని అపరిమితంగా వాడుకోవచ్చు. ఇందుకోసం స్మార్ట్ ఫోన్ లో *325# ను డయల్ చేసి, ఫేస్ బుక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తే చాలు... ఫేస్ బుక్ ఫీచర్లలోకి ఎంటరైపోవచ్చు. దీంతో యుఎస్ఎస్ డీ ద్వారా మొబైల్ హ్యాండ్ సెట్ కు సమాచారం బదిలీ అయిపోతుంది.
అయితే ప్రస్తుతం ఇండియాలో ఈ అవకాశం కొన్ని నెట్వర్క్ లకు మాత్రమే పరిమితమైంది. ఎయిర్ టెల్, ఎయిర్ సెల్, ఐడియా, టాటా డొకొమో వినియోగదారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. త్వరలో మిగిలిన నెట్బర్క్ లకు సైతం అందుబాటులోకి తేవాలని ఫేస్ బుక్ భావిస్తోంది.