వయగ్రాతో గుండె జబ్బులు దూరం
లండన్: లైంగిక ఉద్దీపన కోసం వాడే వయగ్రా మాత్రలను హృద్రోగులు, అధికరక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తులు వాడరాదంటూ ఇంతకాలం వైద్య నిపుణులు చెబుతూ వచ్చారు. వయగ్రా వాడడం వల్ల గుండె రక్తనాళాల్లో రక్త ప్రవాహం ఒత్తిడి పెరిగి గుండెపోటు వస్తుందనే అభిప్రాయమే అందుకు కారణం. వాస్తవానికి వయగ్రా మాత్రలు వాడడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని తమ తాజా పరిశోధనల్లో వెల్లడైనట్లు ఇంగ్లండ్‌లోని మాన్‌చెస్టర్ యూనివర్శిటీకి చెందిన వైద్య నిపుణులు తెలిపారు.
మధుమేహంతో బాధపడుతున్న ఆరువేల మందిపై తాము జరిపిన పరిశోధనల్లో ఈ సరికొత్త విషయం తేలిందని చెప్పారు. మధుమేహంలేనివారికే ఎక్కువగా హృద్రోగ సమస్యలు వచ్చాయని, కొంత మందికి గుండెపోటు కూడా వచ్చిందని, మధుమేహం ఉన్న వారిలో హృద్రోగ సమస్యలు బాగా తగ్గిపోయాయని వారు చెప్పారు. మధుమేహం ఉన్నవారికి ఎక్కువగా హృద్రోగ సమస్యలు వస్తాయికనుక వారినే ప్రధాన ప్రాతిపదికగా తీసుకొని తాము అధ్యయనం జరిపామని వారన్నారు. మధుమేహగ్రస్థుల్లో గుండె కండరాలు బిగుసుకుపోతాయని, రక్తనాళాలు కుంచించుకుపోతాయని, పర్యవసానంగా గుండె సమస్యలు వస్తాయని వారు చెప్పారు.
మధుమేహులకు వయగ్రా మాత్రలు ఇవ్వడం వల్ల వారి గుండె రక్తనాళాల్లో రక్త ప్రవాహం పెరగడంతో వాటిలో ఉండే కండరాల కణజాలం క్రియాశీలకంగా మారిందని, వయగ్రా మాత్రల్లో ఉండే ‘పీడీఈ5ఐ’ రసాయనం కారణంగా ఇలా జరిగిందని ప్రొఫెసర్ ఆండ్రీ ట్రాఫోర్డ్ ఆధ్వర్యంలో అధ్యయనం జరిపిన బృందం పేర్కొంది. వయగ్రా వల్ల గుండె కొట్టుకునే వేగం కూడా నియంత్రణలోనికి వచ్చిందని తెలిపింది. ఈ కారణంగా గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా వయగ్రా మాత్రలను ఇవ్వొచ్చన్నది తమ అధ్యయనంలో తేలిన అంశమని బ్రిటన్ హార్ట్ ఫౌండేషన్ తరఫున అధ్యయనం జరిపిన వైద్య బృందం స్పష్టం చేసింది. తాము ఎంపిక చేసుకున్న ఆరువేల మంది మధుమేహగ్రస్థుల్లో వయగ్రా వాడడం వల్ల ఎవరికీ హృద్రోగ సమస్యలు రాలేదని, వాడని వారికే వచ్చాయని తెలిపింది. వారు అధ్యయనం వివరాలను ‘జర్నల్ బీఎంజే హార్ట్’లో ప్రచురించారు.
వాస్తవానికి ఆంజినా అనే గుండె జబ్బును నయం చేయడంలో భాగంగానే 20 ఏళ్ల క్రితం వయగ్రా మాత్రను కనుగొన్నారు. దానివల్ల లైంగిక ఉద్దీపన ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గ్రహించి దీన్ని సెక్స్ డ్రగ్‌గా ముద్రవేశారని వైద్య నిపుణులు ఇంతకుముందు కూడా చెబుతూ వచ్చారు. తాజా పరిశోధనతో వయగ్రా గుండె జబ్బులు రాకుండానే ఎక్కువ ఉపయోగపడుతుందని గ్రహించారు.