
హర్రర్ సినిమాలు చూడనివ్వండి..
లండన్: పిల్లలు హర్రర్ సినిమాలు చూస్తుంటే చాలా మంది తల్లిదండ్రులు వద్దంటారు. ఎందుకంటే దాని వల్ల వారు భయాందోళనలకు లోనైతే మానసిక పరమైన సమస్యలు వస్తాయని వారి భయం. అయితే ఇక నుంచి తల్లిదండ్రులు అలాంటి భయాలేమీ పెట్టుకోకుండా మీ చిన్నారులను హర్రర్ సినిమాలను చూడనివ్వండి అని అంటున్నారు లండన్ పరిశోధకులు. నిజానికి ఇలాంటి సినిమాలు చూసిన అందరూ భయపడి ఒత్తిడికి లోనవుతారనేది వాస్తవం కాదని అన్నారు. చాలా కొద్ది మంది చిన్నారులు మాత్రమే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారని, అది కూడా మరీ చిన్న వయసు వారిలో మాత్రమే ఇలా జరుగుతుందని తెలిపారు.
కాబట్టి ఎవరో ఒకరిద్దరిలో ఇలా జరుగుతుంది కాబట్టి మొత్తం చిన్నారులందరినీ వీటికి దూరం చేయడం సమంజసం కాదని పరిశోధకులు పేర్కొన్నారు. ‘అయితే ఆ కొద్ది మంది చిన్నారులు మాత్రం ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఎందుకు భయం, ఆందోళన, ఒత్తిడి.. వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే దానిపై మరింత పరిశోధన జరగాలి. దీనికి కారణాలు తెలిస్తే వీటి గురించి తల్లిదండ్రులకు మరింత విలువైన సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఫీల్డ్ అన్నారు. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు ‘హ్యూమన్ కమ్యూనికేషన్ రీసెర్చ్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.