
సాక్షి, హైదారాబాద్: దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ మహానగరం.. తాగునీరు లేక ఎడారిగా మారబోతున్న నగరం... మనిషికి 50 లీటర్లు మాత్రమేనంటూ నీటికి రేషన్ విధించింది తొలి నగరం. ఆ దుస్థితే ప్రపంచ దేశాలు చూసే రోజు ఎంతో దూరంలో లేదు. నీటిసంక్షోభం 2050 నాటికి మరింత తీవ్రతరం కానుందని ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక హెచ్చరించింది. అప్పటికి 500 కోట్ల మంది నీరు లభ్యం కాని ప్రాంతాల్లోనే నివాసం ఉండాల్సిన పరిస్థితి వస్తుందని వెల్లడించింది. 2050నాటికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుకుంటుందని అంచనాలున్నాయి. అంటే సగం మంది జనాభా గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీరు దొరక్క అవస్థలు పడతారన్న మాట. అందులోనూ సురక్షిత నీరు దొరక్క భారత్ వంటి దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి. మార్చి 22న వరల్డ్ వాటర్ డే సందర్భంగా యునెస్కో తన నివేదికలో నీటివనరులపై భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరించింది. వాతావరణంలో వస్తున్న మార్పులు, నీటికి డిమాండ్ పెరగడం, నీటి కాలుష్యాన్ని అరికట్టడంలో ప్రభుత్వాల వైఫల్యం వంటి కారణాలతో నీటికి తీవ్ర కొరత ఏర్పడుతుందని తెలిపింది. ఆ నివేదిక ఏం చెప్పిందంటే ...
- చైనా, భారత్, అమెరికా, రష్యా, పాకిస్థాన్ దేశాలు అత్యధికంగా నీటిని వినియోగిస్తున్నాయి.
- ఆ దేశాలే నీటి సంక్షోభంలో చిక్కుకొని విలవిలలాడతాయి.
- భూమిపై 70 శాతం నీరు ఉంటే అందులో స్వచ్ఛమైన నీరు కేవలం 2 శాతం మాత్రమే మధ్య భారతం అత్యధికంగా నీటికొరతను ఎదుర్కొంటుంది.
- 2050నాటికి 40 శాతం నీటి వనరులు తగ్గిపోతాయి.
- పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి పడిపోతాయి.
- దక్షిణ భారత్ నీటి కాలుష్యం సమస్యని అత్యధికంగా ఎదుర్కొంటుంది.
- దక్షిణభారతంలో ఉన్న నదులన్నీ 2050నాటికి విషతుల్యంగా మారతాయి.
- బహిరంగ మలవిసర్జన, వివిధ రకాల వ్యర్థాల కారణంగా భూగర్భజలాలు కాలుష్యంతో నిండిపోతాయి. ఈకోలి బ్యాక్టేరియా సమస్య తీవ్రతరమవుతుంది.
- భారత్‌లో 21 శాతం వ్యాధులు నీటి ద్వారా సంక్రమిస్తున్నవే.
- ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మంది సురక్షిత మంచి నీరు అందడం లేదు.
- భారత్‌లో 16.3 కోట్ల మంది భారతీయులకు రక్షిత మంచినీరు లభ్యం కావడం లేదు.
- పరిశుభ్రమైన తాగు నీరు లేక భారత్‌లో ప్రతీరోజూ అయిదేళ్ల లోపు వయసున్న చిన్నారులు దాదాపు 500 మంది మరణిస్తున్నారు.
- ఏడాదికి ఏడాది నీటి వినియోగం 1 శాతం పెరుగుతూ వస్తోంది.
- వాతావరణంలో వస్తున్న విచిత్రమైన పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటికి కట కట ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో వరద ముంపునకు గురవుతాయి. 2050 నాటికి 116 కోట్ల మందికి వరదల వల్ల ముప్పుని ఎదుర్కొంటారు.
- ప్రపంచవ్యాప్తంగా నీటి సమస్యల్ని అధిగమించడానికి ప్రకృతి సంబంధమైన పరిష్కారాల కోసం కసరత్తు చేయాలని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే సూచించారు. వర్షపు నీటిని రీసైక్లింగ్‌కు చైనా అనుసరిస్తున్న విధానాలు, భారత్‌లో ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన నీటిసంరక్షణ, అటవీప్రాంతాన్ని విస్తరించడం వంటి చర్యలు, ఉక్రెయిన్‌లో కృత్రిమ చిత్తడి నేలల్ని రూపొందించడం వంటివి అన్ని చోట్లా చేపట్టాలని ఆ నివేదిక సిఫారసు చేసింది. అలా చేయడం వల్ల నీటి సంక్షోభం బారి నుంచి తప్పించుకోవడమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆహార ఉత్పత్తుల్ని 20 శాతం పెంచుకోవచ్చునని ఆ నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment