మౌస్‌కు మూడినట్టే!
1960ల నుంచీ కంప్యూటర్ కు అట్టిపెట్టుకుని ఇప్పటికీ మన చేతుల్లో ఆడుతూ వస్తున్న మౌస్‌కు ఇక కాలం చెల్లినట్లే. ఎందుకంటే.. చేతివేలికి తొడుగులా కనిపిస్తున్న ఈ పరికరమే ఇకపై మౌస్ చేసే పనులన్నీ చేయనుంది. ఇప్పటిదాకా మనం వాడుతున్న మౌస్ కంప్యూటర్ తెరపై రెండు కోణాల్లో మాత్రమే కర్సర్‌ను కదిలిస్తుంది. అదే ఈ కొత్త పరికరం మూడు కోణాల్లోనూ కర్సర్‌ను కదిలిస్తుందట. అందుకే దీనికి ‘3డీ టచ్’ అని పేరు పెట్టారు.
త్రీడీ యాక్సిలెరోమీటర్, త్రీడీ మాగ్నెటోమీటర్, త్రీడీ గైరోస్కోప్, ఆప్టికల్ సెన్సర్లను పొందుపర్చి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వ్యోమింగ్ పరిశోధకులు దీనిని తయారు చేశారు. ప్రస్తుతం తీగలు తగిలించినా.. భవిష్యత్తులో వైర్‌లెస్‌గా పనిచేసేలా మారుస్తారట. దీనిని పెట్టుకుని వేలును కంప్యూటర్ తెరముందు కదిలిస్తే చాలు.. వేలు కదిలినట్టల్లా.. కర్సర్ కదులుతుంది. అలాగే మౌస్ ప్యాడ్‌పై వేలును తట్టి క్లిక్ చేయడంతో పాటు తెరపై వస్తువులను డ్రాగ్ చేయొచ్చు కూడా.