టెక్ దిగ్గజాలు ఉదయం లేవగానే ఏం చేస్తారు?
టెక్ దిగ్గజాలు ఉదయం లేవగానే ఏం చేస్తారు?
Published Mon, Aug 22 2016 3:19 PM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM
న్యూయార్క్: ఉదయం లేవగానే ఎవరికైనా దినచర్యలు ప్రారంభమవుతాయి. అయితే అందరి దినచర్యలు ఒకేలా ఉండవు. కొందరు నిద్రలేవగానే జాగింగ్, వాకింగ్ లేదా జిమ్‌లకు వెళతారు. మరికొందరు వేడి వేడి కాఫీ తాగుతారు. కాసేపు బడలికతో గడుపుతారు. కొందరు పత్రికలు తిరగేస్తారు. మరికొందరు స్నానాదులు ముగించుకొని నేరుగా బ్రేక్‌ఫాస్ట్‌కు కూర్చుంటారు. ఆ తర్వాత ఆఫీసులకు వెళతారు. మరికొందరు పొద్దెక్కాక బద్దకంగా లేస్తారు. ఆఫీసుకు టైమ్ అవుతుందంటూ ఆదరాబాదరగా ప్రాథ:కాల కార్యక్రమాలు ముగించుకొని టిఫిన్ చేసి ఆఫీసుకు పరుగులు తీస్తారు.
ఆధునిక సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ప్రపంచ సంపన్నులుగా ఎదిగిన టెక్ దిగ్గజాలు, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాధినేతల దినచర్యలు ఎలా ఉంటాయన్న ఆసక్తికర అంశంపై ‘స్లీపీ పీపుల్ డాట్ కామ్’ వివరాలు సేకరించింది. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు 31 ఏళ్ల మార్క్ జుకర్‌బర్గ్ లేచి లేవగానే బాత్‌రూమ్‌లో దూరి స్నానపానాదులు ముగించుకొని నేరుగా బట్టల కబోర్డు వద్దకు వెళ్లి తనకిష్టమైన బూడిద రంగు టీ షర్టు ధరిస్తారు. ఆ షర్టును ధరిస్తేనే తాను సానుకూల నిర్ణయాలు తీసుకుంటానని ఆయన నమ్మకం. ఆ తర్వాత నేరుగా ఆయన ఆఫీసుకు వెళ్లిపోతారు. ఆయన నిద్రపోయేది తక్కువ. ఒక్కోసారి ఆయన తన ఫేస్‌బుక్ ఉద్యోగులతో మాట్లాడుతూ తెల్లవారు జామున ఆరు గంటల వరకు మేలుకొనే ఉంటారు. అలాగే తయారై ఆఫీసుకు వెళతారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు, టెక్ బిలియనీర్ బిల్ గేట్స్ లేచి లేవగానే ట్రెడ్ మిల్ వద్దకెళ్లి గుండెకు సంబంధించిన ఎక్సైర్‌సైజులు గంటసేపు చేస్తారు. అనంతరం ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన వీడియోలు చూస్తారు. వాటిలో సూచించినట్లుగా ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకుంటారు. ఆఫీసుకు బయల్దేరి వెళతారు. ఆపిల్ కంపెనీని ప్రపంచ దిగ్గజ కంపెనీగా తీర్చిదిద్దిన దివంగత స్టీవ్ జాబ్స్ నిద్ర లేవగానే నేరుగా అద్దం ముద్దుకెళ్లి తనను తాను తదేకంగా కాసేపు చూసుకునే వారట. ‘ఈ రోజు నా జీవితంలో ఆఖరి రోజయితే ఈ రోజు నేను తీసుకునే నిర్ణయాలు, చేసే కార్యక్రమాలు నాకు సంతృప్తినిస్తాయా?’ అని తనలో తాను ప్రశ్నించుకునేవారట. ఆ తర్వాతే ఆయన రోజువారి కార్యక్రమాలు ప్రారంభమయ్యేవట.
స్టార్‌బక్స్ సీఈవో హొవర్డ్ షుల్జ్ తెల్లవారు జామున 4.30 గంటలకే నిద్ర లేస్తారు. తన మూడు పెంపుడు కుక్కలను తీసుకొని వాకింగ్‌కు వెళతారు. గంట తర్వాత ఇంటికి తిరిగొచ్చి తాను కాఫీ కలుపుకుంటారు. దాన్ని సేవిస్తారు. 5.45 గంటల ప్రాంతంలో తన భార్యకు కాఫీ కలిపిస్తారు. ఆ తర్వాత ఆఫీసు పనులు చూసుకుంటారు. అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ మిగతా టెక్ దిగ్గజాల్లాగ తెల్లవారు జామునే లేవరు. ఆయన ఎనిమిది గంటలు నిద్ర పోతారట. ఉదయం పూట బద్ధకంగా గడుపుతారట. భార్య మెకంజీ, నలుగురు పిల్లలతో తీరిగ్గా అల్పాహారం చేస్తారట. తాపీగా ఆఫీసుకు బయల్దేరుతారట. అందుకనే ఆయన ఉదయం ఆఫీసు మీటింగ్‌లు ఉండకుండా చూసుకుంటారట.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిరోజు ఉదయం 6.45 గంటలకు నిద్రలేస్తారు. ముఖం కడుక్కొని నేరుగా జిమ్‌కు వెళ్లి గంటకుపైగా వ్యాయామం చేస్తారు. ట్రెడ్ మిల్‌పై పరుగెత్తడంతోపాటు వెయిట్ లిఫ్టింగ్ కూడా చేస్తారు. ఆ తర్వాత, భార్య, ఇద్దరు పిల్లలతో కలసి అల్పాహారం తీసుకుంటారు. పిల్లలను స్కూల్‌కు పంపించాక తన అధికార బాధ్యతల్లో మునిగిపోతారు.
మొన్నటి వరకు బ్రిటన్ ప్రధాన మంత్రిగా కొనసాగిన డేవిడ్ కామెరాన్ ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకే లేస్తారు. ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఆఫీసు పనులు చూసుకునేవారు. ఎనిమిది గంటల ప్రాంతంలో భార్య సమంత, ఇద్దరు అమ్మాయిలతో కలసి టిఫిన్ చేస్తారు. వీరి దినచర్యలో ఇప్పుడు కొద్దిగా మార్పులు చేసుకొని ఉంటే వుండవచ్చు. ఎందుకంటే వారు తమ దినచర్యల గురించి వివిధ సందర్భాల్లో వివిధ పత్రికలకు వెల్లడించిన అంశాలను ‘స్లీపీ పీపుల్ డాట్ కామ్ క్రోడీకరించి’ తెలియజేసింది.
Advertisement
Advertisement