‘‘దిస్ ఈజ్ బిజినెస్’’.. ప్రతీ దాంట్లోనూ లాభం వెతుక్కుంటున్నాయి కంపెనీలు. ఇందులో ముఖ్యంగా టెక్ దిగ్గజాల తీరు విపరీతమైన చర్చకు దారితీస్తోంది. విషాదం దగ్గరి నుంచి వినోదం దాకా దేన్నికూడా వదలకుండా క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో దిగ్భ్రాంతికి గురి చేసే భారీ వ్యాపారం గురించి తాజాగా ఓ నివేదిక బయటపెట్టింది.
ఉగ్రవాదంపై పోరు వంకతో కోటానుకోట్లు వెనకేసుకుంటున్నాయి టెక్ కంపెనీలు. కంపెనీల సాంకేతికతను, ఇతరత్ర సేవల్ని(ఇంటర్నెట్ ప్రమోషన్లు సైతం) ఉపయోగించుకునేందుకు.. భద్రతా ఏజెన్సీలు భారీగా నిధులు వెచ్చించి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ వ్యాపారంలో డబ్బు వరదలా ప్రవహిస్తోంది. 9/11 దాడులకు 20 సంవత్సరాలు పూర్తైన తరుణంలో.. ‘వార్ ఆన్ టెర్రర్’ పేరిట గురువారం ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అయ్యింది. ఇందులో అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్.. ఇలా దాదాపు అగ్ర టెక్ కంపెనీలు, ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉగ్రవాదాన్ని క్యాష్ చేసుకుని ఎలా బిలియన్లు వెనకేసుకుంటున్నాయో పూసగుచ్చినట్లు వివరించారు. క్లిక్: కొత్త ఇల్లు కొనేవారికి ఎల్ఐసీ గుడ్ న్యూస్!
2001 నుంచే..
ప్రస్తుతం టెక్ దిగ్గజాలు.. యూఎస్ మిలిటరీతో పాటు ఇతర దేశాల ఏజెన్సీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. బిగ్ టెక్ సెల్స్ వార్ వ్యాపారం 2004 నుంచి తారాస్థాయిలో నడుస్తోందని, ఇందుకోసం టెక్ దిగ్గజాలు భారీ స్థాయిలో భద్రతా ఏజెన్సీల నుంచి డబ్బులు అందుకుంటున్నాయని వెల్లడించింది. ‘‘ నిజానికి 2001 నుంచి రక్షణ రంగాలు డిజిటలైజేషన్ అవుతున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, జీపీఎస్ సాఫ్ట్‌వేర్ వాడకం విపరీతంగా పెరిగింది. చాలా దేశాలు వీటి అవసరం లేకున్నా.. ఒప్పందాల్ని చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో కేవలం అమెరికా రక్షణ రంగం ఒక్కటే పలు టెక్ కంపెనీలతో సుమారు 43.8 బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంద’’ని బయటపెట్టింది ఈ డాక్యుమెంటరీ.
57 దేశాల ఏజెన్సీలు
2004 నుంచి ఇప్పటిదాకా.. పెంటగాన్, హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ నుంచి టెక్ కంపెనీలకు విపరీతమైన ఫండ్లు వస్తున్నాయట. ఒక్క అమెరికాకే కాదు.. దాదాపు 57 దేశాల భద్రతా ఏజెన్సీలు(ఇందులో భారత్ ఉందో లేదో స్పష్టత లేదు) టెక్ దిగ్గజాల ఒప్పందాలు చేసుకున్నాయి. మరో విశేషం ఏంటంటే.. అమెరికాకు సంబంధించిన ఈ సమాచారం అంతా పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్నా ఇన్నాళ్లూ ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం. ఇక ఫారిన్ పాలసీలు లేదంటే నేరు విధానాల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. అన్నిరకాల సేవలు.. ఆన్‌లైన్ టూల్ కాంట్రాక్ట్స్ ద్వారా ఇదంతా నడుస్తోందని తెలిపింది.
కీలక పదవులు
జార్డ్ కోహెన్.. ఒకప్పుడు స్టేట్‌డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి. ఇప్పుడాయన గూగుల్‌లో పని చేస్తున్నారు. ఇక నిఘా ఏజెన్సీ ఎఫ్‌బీఐలో పనిచేసిన స్టీవ్ పండెలిడెస్.. ప్రస్తుతం అమెజాన్‌లో పని చేస్తున్నాడు. మైక్రోసాఫ్ట్ జోసెఫ్ రోజెక్.. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. ఇదంతా పరస్సర ఒప్పందాల్లో భాగంగానే నడిచిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Comments
Please login to add a commentAdd a comment