ఐటీ ఉద్యోగులకు 2023 అంత్యంత చెత్త సంవత్సరంగా మిగిలిపోనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలు ఎంతమంది ఉద్యోగుల్ని తొలగించాయని గుర్తించే లేఆఫ్స్.ఎఫ్‌వైఐ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది.
అందులో 696 సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఈ ఏడాది మే 18 వరకు సుమారు రెండు లక్షల మంది (1,97,985) ఉద్యోగుల్ని తొలగించినట్లు తేలింది. రానున్న రోజుల్లో టెక్నాలజీ విభాగంలో మరిన్ని తొలగింపులు ఉంటాయని సూచనప్రాయంగా తెలిపింది.
గత ఏడాది కంటే ఈ ఏడాదే ఎక్కువ
2022లో తొలగించిన ఉద్యోగుల కంటే ఇప్పటి వరకు ఉద్వాసనకు గురైన ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. గత ఏడాదిలో మొత్తం 1056 టెక్ సంస్థలు 1.64 లక్షల మందిని ఫైర్ చేయగా.. ఈ ఏడాదిలో ఇప్పటికే 2 లక్షల మంది ఉద్యోగం కోల్పోయినట్లు వెల్లడించింది.
ఉద్యోగుల‍్ని నిర్ధాక్షణ్యంగా ఇంటికి సాగనంపడంలో
ఇక, ఉద్యోగుల‍్నినిర్ధాక్షణ్యంగా ఇంటికి సాగనంపే జాబితాలో దిగ‍్గజ టెక్ కంపెనీలు మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌లు ఉన్నాయి. వాటిల్లో ట్విటర్ అగ్రస్థానంలో ఉంది. 2022లో ట్విటర్ బాస్‌గా బాధ్యతలు చేపట్టిన ఎలాన్ మస్క్ తొలిసారి ఉద్యోగులపై వేటు వేశారు. ఆ తర్వాతే గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌లు ఉద్యోగుల్ని ఫైర్ చేస్తూ వచ్చాయి. ఇలా ప్రతినెలా సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకోవడం తప్పడం లేదంటూ వర్క్ ఫోర్స్ తగ్గించుకునేందుకే మొగ్గు చూపాయి.
భారతీయ కంపెనీలు సైతం
తాజాగా, మెటా 6,000 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేయనున్నట్లు అధికారికంగా ప‍్రకటించింది. ఇలా, ఇప్పటికే నవంబర్‌లో 11,000 మందిని, ఈ ఏడాది మార్చిలో 10,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. యాక్సెంచెర్ సైతం 19,000 మందికి గుడ్ బై చెప్పింది. అంతర్జాతీయ కంపెనీలతో పాటు భారత్‌కు చెందిన డంజో, షేర్ చాట్, రిబెల్ ఫుండ్స్, భారత్ అగ్రి, ఓలా సైతం సిబ్బందిని తగ్గించుకున్నాయి.
యాపిల్ అందుకు భిన్నం
పైన పేర్కొన్న ఐటీ కంపెనీల పరిస్థితి ఇలా ఉంటే యాపిల్ సంస్థ మాత్రం ఉద్యోగుల్ని ఫైర్ చేయడం సరైన మార్గం కాదని, ఆ పరిస్థితుల్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఎక్కువ శాతం సంస్థలు ఆర్ధిక మాంద్యాన్ని బూచీగా చూపిస్తూ ఉద్యోగుల్ని తొలగిస్తుంటే యాపిల్ మాత్రం 2016 నుంచి ఉద్యోగుల నియామాకం అలాగే కొనసాగిస్తూ వచ్చినట్లు ఫోర్బ్స్ తెలిపింది.
చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే?
Comments
Please login to add a commentAdd a comment