న్యూయార్క్ : చిన్నపిల్లలుగా ఉన్నప్పడు తల్లిదండ్రులతోపాటు అమెరికా వచ్చి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న యువత(డ్రీమర్స్)ను అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చట్టాన్నితీసుకురావాలనే యోచనపై అమెరికా సెనేట్‌లో వాడివేడి చర్చ జరిగింది. సుమారు 8 లక్షల మంది డ్రీమర్స్ వర్క్ పర్మిట్ల భవితవ్యంపై ఈ చర్చలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సుమారు 8లక్షలమంది డ్రీమర్స్ వర్క్ పర్మిట్లను రద్దు చేస్తూ డోనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చర్చకు దారి తీసింది.
ఇందులో దాదాపు ఏడువేలమంది భారతీయ అమెరికన్ యువకులు కూడా బాధితులుగా ఉన్నారు. దీనిపైనే తాజాగా సెనేట్‌లో చర్చించారు. చర్చలో వివరాలు పరిశీలిస్తే.. అసలు దేశంలో డ్రీమర్స్ ఎంతమంది ఉన్నారని లెక్కలు తీస్తే సాధరణంగా అనుకునేదానికంటే భిన్నంగా దాదాపు 3.6మిలియన్లు ఉన్నారని తెలుస్తోంది. ట్రంప్ నిర్ణయంతో ప్రస్తుతం వీరి జీవితాలు ప్రమాదంలో పడనున్నాయి. అయితే, వీరిలో ప్రత్యేకంగా ఒబామా హయాంలో డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ వుడ్ అరైవల్ (డీఏసీఏ) చట్టం కింద తీసుకొచ్చిన 8లక్షలమంది యువకుల భవిష్యత్తు ఏమిటనే ఆలోచనే ఎక్కువగా అక్కడి వారి మెదళ్లను తొలుస్తోంది. అందుకు కారణం ఆ చట్టం సెప్టెంబర్‌లో ముగిసిపోయింది. దీంతో వీరిగురించే ప్రస్తుతం ట్రంప్‌తో సంప్రదింపులు జరిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇంతకు ఏంటి డ్రీమర్స్ చట్టం..!
చిన్నతనంలోనే సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికా వచ్చిన విదేశీ మైనర్ల అభివృద్ధి, వారికి పరిహారం, విద్యాభ్యాసానికి అవకాశం కల్పించడంవంటి అంశాలతో రూపొందించినదే డ్రీమర్స్ చట్టం. దీనికి అర్హులు కావాలంటే వారు కొన్ని నియమాలను పాటించాలి.
అమెరికాలోనే చదువుకోవాలి
దరఖాస్తు చేసుకోనే సమయంలో వయసు 30 ఏళ్లకు మించకూడదు
కొన్ని సంవత్సరాలుగా అమెరికాలోనే నివాసం ఉండాలి
మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి.
వలసదారుల నియమాలను అతిక్రమించరాదు.
2001లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఇంతవరకూ ఆమోదం పొందలేదు.
ఈ బిల్లు చట్టంగా మారి ఉంటే వీరందరికి రక్షణ లభించేది.
డీఏసీఏ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ వుడ్ అరైవల్)
అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులకు రక్షణ కల్పించడం కోసం 2012లో ఒబామా తీసుకువచ్చిన తాత్కలిక చట్టమే డీపీసీఏ. ఈ తాత్కాలిక చట్టం ప్రకారం డ్రీమర్స్ అర్హత సాధించాలంటే..
16 సంవత్సరాల వయసులోపు అమెరికా వచ్చి ఉండాలి
2012 జూన్ 15 నాటికి ఐదు సంవత్సరాలుగా అమెరికాలో నివాసం ఉండాలి
2012 జూన్ 15 నాటికి వారి వయస్సు 31 సంవత్సరాలు మించరాదు.
ఈ నిబంధనల ప్రకారం ఒబామా హయాంలో 8లక్షల మంది డ్రీమర్స్ అర్హత సాధించారు. వీరికి ఒబామా ప్రభుత్వం రెండేళ్లపాటు వర్క్ పర్మిట్ కల్పించింది. దీనిని పొడగించేందుకు అవకాశం కూడా కల్పించారు.
ట్రంప్ ప్రభుత్వం ఏం చేసింది?
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆయన ప్రభుత్వం 2017, సెప్టెంబర్‌లో ఈ తాత్కాలిక చట్టాన్ని పూర్తిగా రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై ట్రంప్ సంతకం కూడా చేశారు. అయితే, ఒక ఆరు నెలల మాత్రమే గడువు ఇచ్చిన ట్రంప్ సర్కార్ గడువు దాటిని తర్వాత కూడా అక్కడే ఉంటున్నవారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ అరెస్టు చేస్తోంది. వారిని బలవంతంగా దేశం నుంచి పంపించివేస్తున్నారు. అరెస్టులు ఎంత తీవ్రంగా ఉన్నాయో చెప్పేందుకు ఇటీవల జనవరి 15న (2018) జార్జిగార్సియా అనే వ్యక్తిని బలవంతంగా దేశం నుంచి పంపించివేయడమే నిదర్శనం.
ఎవరేమంటున్నారంటే ..
వీరంతా అక్రమ వలసదారులే. వర్క్ పర్మిట్ వచ్చినంత మాత్రన వారికి పూర్తి హక్కులు ఉన్నట్లు కాదు - రిపబ్లికన్స్
ఇన్ని మిలియన్ల డ్రీమర్స్‌ను బహిష్కరించడం అనైతికం, ఈ దేశ అభివృద్ధిలో వారి కృషి మరవలేనిది - అలీ నూరాని (నేషనల్ ఇమ్మిగ్రేంట్స్ ఫోరమ్ ప్రో ఇమ్మిగ్రేంట్ ఎక్సిక్యూటీవ్ డైరెక్టర్ )
ఈ 8లక్షల మందికి మాత్రం ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే సరిపోతుంది - మార్క్ కిర్కోరియాన్ (సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టాటస్ ఎక్సిక్యూటీవ్ డైరెక్టర్)
నాటి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిమిత సంఖ్యలో డ్రీమర్స్‌కు రక్షణ కల్పించారు. కానీ ఇప్పుడు ఈ అంశంలో మొత్తం కాంగ్రెస్ పాలుపంచుకుంది. కాబట్టి సరైన చట్టం తీసుకొచ్చి అర్హులైన వారందరికి భద్రత కల్పించవచ్చు - సెసిలియా మునోజ్ (ఒబామా హయాంలో దేశీయ విధాన డైరెక్టర్)
Comments
Please login to add a commentAdd a comment