‘యునైటెడ్‌ స్టేట్స్‌’కు అధ్యక్షుడిని..! | US President-elect Joe Biden addressed the nation from Wilmington | Sakshi
Sakshi News home page

‘యునైటెడ్‌ స్టేట్స్‌’కు అధ్యక్షుడిని..!

Published Mon, Nov 9 2020 4:03 AM | Last Updated on Mon, Nov 9 2020 9:55 AM

US President-elect Joe Biden addressed the nation from Wilmington - Sakshi

యూఎస్‌కు అధ్యక్షుడిగా...
విద్వేషాన్ని, విభజనను కోరుకోని, ఐక్యతను అభిలషించే అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నా. దేశాన్ని రెడ్‌ స్టేట్స్‌ (రిపబ్లికన్‌ పార్టీ ఆధిక్యత రాష్ట్రాలు), బ్లూ స్టేట్స్‌ (డెమొక్రటిక్‌ పార్టీ ఆధిక్యత రాష్ట్రాలు)గా విభజించి చూసే నేతగా కాకుండా.. మొత్తం అమెరికాను ఐక్య అమెరికాగా పరిగణించే ‘యునైటెడ్‌ స్టేట్స్‌’కు అధ్యక్షుడిగా ఉంటా.            

ట్రంప్‌ను ఉద్దేశించి...
మీ నిరుత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. ఓటమి బాధ నాకు కూడా అనుభవమే. ఇప్పుడు అమెరికాకు అయిన గాయాన్ని కలసి మాన్పుదాం. అమెరికా ఘన చరిత్రను పునర్లిఖించుదాం. ప్రపంచమంతా అమెరికాను మళ్లీ గౌరవించేలా చేద్దాం.

కరోనాపై యుద్ధం...
కరోనా వైరస్‌ను నియంత్రించే, సౌభాగ్య అమెరికాను పునర్నిర్మించే, ఆరోగ్యాన్ని, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించే, జాత్యహంకారాన్ని అంతం చేసే యుద్ధం చేయమని నన్ను ఎన్నుకున్నారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను.

వాషింగ్టన్‌: అమెరికాలో కొనసాగుతున్న రాక్షస పాలనకు తక్షణమే అంతం పలకాలనుకుంటున్నానని ఆ దేశానికి కాబోయే అధ్యక్షుడు, డెమొక్రటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుత అధ్యక్షుడు, తాజా ఎన్నికల్లో తన ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ పేరును నేరుగా ప్రస్తావించకుండా.. అమెరికా ఎదుర్కొంటున్న బాధాకరమైన చీకటి సమయం అంతం కావడం ప్రారంభమైందని పేర్కొన్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం శనివారం డెలావర్‌లోని సొంత పట్టణం విల్మింగ్‌టన్‌లో అభిమానులను ఉద్దేశించి బైడెన్‌ విజయోత్సవ ప్రసంగం చేశారు. ‘విద్వేషాన్ని, విభజనను కోరుకోని, ఐక్యతను అభిలషించే అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నాను. దేశాన్ని రెడ్‌ స్టేట్స్‌(రిపబ్లికన్‌ పార్టీ ఆధిక్యత ఉన్న రాష్ట్రాలు), బ్లూ స్టేట్స్‌(డెమొక్రటిక్‌ పార్టీ ఆధిక్యత ఉన్న రాష్ట్రాలు)గా విభజించి చూసే నేతగా కాకుండా.. మొత్తం అమెరికాను ఐక్య అమెరికాగా పరిగణించే ‘యునైటెడ్‌ స్టేట్స్‌’కు అధ్యక్షుడిగా ఉంటాను’ అని బైడెన్‌ దేశ పౌరులకు హామీ ఇచ్చారు. దేశంలో కోవిడ్‌–19ను నియంత్రించడమే అధ్యక్షుడిగా తన తొలి లక్ష్యమని పేర్కొన్నారు.

అందుకు ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందిస్తానన్నారు. ‘ఈ బైడెన్‌–హ్యారిస్‌ కోవిడ్‌ ప్లాన్‌ను రూపొందించి, అమలు చేసేందుకు సోమవారం శాస్త్రవేత్తలు, నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తాను’ అని వివరించారు. పూర్తి శాస్త్రీయతతో ఆ ప్రణాళిక ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో తాను అత్యంత విస్తృతమైన, విభిన్నమైన వర్గాల నుంచి ఓట్లను పొందానన్నారు. ‘నాపై మీరు చూపిన విశ్వాసానికి రుణపడి ఉంటాన’న్నారు. ‘ఈ దేశ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. తమ ఆకాంక్షలను నిర్ద్వంద్వంగా తమ తీర్పు ద్వారా వెలిబుచ్చారు. ఒక ఘన విజయాన్ని అందించారు’ అని బైడెన్‌ పేర్కొన్నారు.

1988, 2008 సంవత్సరాల్లో కూడా బైడెన్‌ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడి, ఓడిపోయారు. ‘అధ్యక్ష పదవికి డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాను. కానీ, అమెరికా అధ్యక్షుడిగా నేను నాకు ఓటు వేసిన వారికోసం, ఓటు వేయని వారి కోసం కూడా పని చేస్తాను’ అని స్పష్టం చేశారు. కాగా, ఈ ఎన్నికల్లో ఓటమిని ట్రంప్‌ ఇంకా అంగీకరించలేదు. పెన్సిల్వేనియా సహా కీలక రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో కేసులు వేయనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. పెన్సిల్వేనియాలో గెలుపుతో సాధించిన 20 ఎలక్టోరల్‌ ఓట్ల కారణంగానే బైడెన్‌ మెజారిటీకి అవసరమైన 270 ఓట్ల మేజిక్‌ మార్క్‌ను చేరుకున్న విషయం తెలిసిందే. ట్రంప్, ట్రంప్‌ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మీ నిరుత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. ఓటమి బాధ నాకు కూడా అనుభవమే. ఇప్పుడు అమెరికాకు అయిన గాయాన్ని కలిసి మాన్పుదాం’ అని బైడెన్‌ పేర్కొన్నారు.

‘అమెరికా ఘన చరిత్రను పునర్లిఖించుదాం. ప్రపంచమంతా అమెరికాను మళ్లీ గౌరవించేలా చేద్దాం’ అని పిలుపునిచ్చారు. ‘మనం శత్రువులం కాదు.. ఒకే దేశస్తులం. అమెరికన్లం’ అని పేర్కొన్నారు. ‘కరోనా వైరస్‌ను నియంత్రించే, సౌభాగ్య అమెరికాను పునర్నిర్మించే, మీ కుటుంబ ఆరోగ్యాన్ని పరిరక్షించే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే, ప్రజలందరికీ సమన్యాయం లభించే,  వ్యవస్థీకృత జాత్యహంకారాన్ని అంతం చేసే యుద్ధం చేయమని కోరుతూ నన్ను ఎన్నుకున్నారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను’ అని బైడెన్‌ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రపంచమంతా ఇప్పుడు అమెరికా వైపు చూస్తోందని, ప్రపంచానికి అమెరికా దిక్సూచి అని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు.  

తనయుడికి ఇష్టమైన కేథలిక్‌ గీతంతో..
తన విజయోత్సవ ప్రసంగాన్ని చనిపోయిన తన కుమారుడు ‘బ్యూ’కు ఇష్టమైన కేథలిక్‌ గీతంతో బైడెన్‌ ముగించారు. ‘ఆన్‌ ఈగిల్స్‌ వింగ్స్‌’ అనే ఈ గీతం కోవిడ్‌–19 కారణంగా తమవారిని కోల్పోయిన ఎందరో అమెరికన్లను ఓదారుస్తుందని భావిస్తున్నానన్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజుల్లో ఈ గీతం తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని వివరించారు. జాన్‌ ఎఫ్‌ కెనెడీ తరువాత అమెరికా అధ్యక్షుడు అవుతున్న కేథలిక్‌.. బైడెనే కావడం విశేషం. బ్రెయిన్‌ ట్యూమర్‌ కారణంగా బ్యూ 2015లో చనిపోయారు.

గాయాలను బైడెన్‌ మాన్పగలరు
అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నిౖకైన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన కమల హ్యారిస్‌ మాట్లాడుతూ.. ‘మీరు ఆశను, ఐక్యతను, మర్యాదను, శాస్త్రీయతను, నిజాన్ని ఎన్నుకున్నారు. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్‌ను ఎన్నుకున్నారు. ఆయన గాయాలను మాన్పే శక్తి ఉన్న వ్యక్తి’ అని మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య వ్యాఖ్యానించారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు బైడెన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళనే కావచ్చు. కానీ చివరి స్త్రీని మాత్రం కాను. ఎందుకంటే ఈ ఎన్నికలను, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న చిన్నారులకు వారి ముందున్న అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి’ అన్నారు.   

సమర్థ నాయకురాలు
కమల హ్యారిస్‌ వంటి సమర్ధురాలు ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడంపై తాను గర్విస్తున్నట్లు బైడెన్‌ తెలిపారు. ‘కమల హ్యారిస్‌తో కలిసి పనిచేయడం గొప్పగా భావిస్తున్నా. ఆమె ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన.. తొలి మహిళగా, తొలి నల్లజాతి మహిళగా, దక్షిణాసియాకు చెందిన మూలాలున్న తొలి వ్యక్తిగా, వలసదారుల కుటుంబం నుంచి వచ్చిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు’ అని ప్రశంసించారు. ఇప్పుడు బైడెన్‌ కుటుంబంలో కమల కూడా భాగమయ్యారన్నారు.   

త్వరలో రంగంలోకి బైడెన్‌ టీమ్స్‌
బైడెన్‌ ప్రమాణ స్వీకారం ముందే పని ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ ఏజెన్సీల పనితీరును సమీక్షించేందుకు నిపుణుల బృందాలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ విభాగాలకు సంబంధించిన బడ్జెట్, ఉద్యోగులు, వివాదాలు, ఇతర నిర్ణయాలను ఈ బృందాలు సమీక్షిస్తాయి. అధికార మార్పిడి సమయంలో పాలనావ్యవహారాలు కుంటుపడకుండా, సజావుగా మార్పిడి జరిగేలా చూస్తాయి. కీలక స్థానాల్లో ఉద్యోగుల బదిలీలతో పాటు, అవసరమైన చోట కొత్త ఉద్యోగుల నియామకాలను పర్యవేక్షిస్తాయి. అలాగే, ఈ విధుల పర్యవేక్షణకు ‘బిల్డ్‌బ్యాక్‌బెటర్‌.కామ్‌’ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నారు.   

బైడెన్‌ కమిటీలో భారతీయుడు!

కొత్త అధ్యక్షుడు బైడెన్‌ ఏర్పాటు చేయనున్న కరోనా  నియంత్రణ కమిటీలో భారతీయ సంతతికి చెందిన డాక్టర్‌ వివేక్‌ మూర్తికి చోటు లభించే చాన్సుంది. కర్ణాటకకు చెందిన వివేక్త్‌ కుటుంబం చాలా ఏళ్ల కిందటే అమెరికాలో స్థిరపడింది. ఒబామా హయాంలో సర్జన్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు.


 




విల్మింగ్‌టన్‌ విజయోత్సవ వేడుకలో వేదికపై కమలా హ్యారిస్‌ దంపతులు, బైడెన్‌ దంపతులు


విల్మింగ్‌టన్‌లో డెమొక్రటిక్‌ పార్టీ విజయోత్సవ వేడుకల దృశ్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement