కాలిఫోర్నియా యూనివర్శిటీకి కాషాయం రంగు
కాలిఫోర్నియా: కాలిఫోర్నియా యూనివర్శిటీ కాషాయం రంగు పులుముకుంటోంది. విద్య అనేది మతాలకు అతీతంగా విజ్ఞాన సముపార్జనే లక్ష్యంగా కొనసాగాలి. కానీ అలా జరగడం లేదని నాన్ ప్రాఫిట్ విద్యా సంస్థగా పనిచేస్తున్న కాలిఫోర్నియా యూనివర్శిటీలో ధర్మ సివిలైజేషన్ ఫౌండేషన్‌కు నాలుగు ‘చేర్స్’ ఉండడమే ప్రత్యక్ష ఉదాహరణ. భారత్‌లో ఆరెస్సెస్ మూలాలున్న ఈ ఫౌండేషన్ అమెరికాలోని ‘హిందూ స్వయం సేవక్ సంఘ్’ మద్దతుతో నడుస్తోంది. ఫౌండేషన్ సభ్యులందరూ ఆరెస్సెస్‌తో సంబంధాలున్న వారే.
వేదాలు, భారతీయ హిందూ సంస్కృతిని అధ్యయనం చేసే విద్యార్థులకు ధర్మ ఫౌండేషన్‌కు చెందిన యూనివర్శిటీలోని నాలుగు చేర్స్ స్పాన్సర్ షిప్ అందిస్తోంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం భారత్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాతనే ధర్మ ఫౌండేషన్ కాలిఫోర్నియా యూనివర్శిటీలో నాలుగు చేర్స్‌ను దక్కించుకోవడం, వాటికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడం ఇక్కడ గమనార్హం. 2015 జనవరి, ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఈ ఒప్పందాలు జరిగాయి.
ఆర్థిక ఇబ్బందులు ఎదొర్కొంటున్న కాలిఫోర్నియా యూనివర్శిటీ, ముఖ్యంగా 2000 సంవత్సరం నుంచి ప్రైవేటు సంస్థలనుంచి విరాళాలు స్వీకరిస్తోంది. 15 లక్షల డాలర్ల విరాళాలు ఇచ్చిన సంస్థకు ఒక్కో చేర్ చొప్పున కేటాయించాలనే నిర్ణయం తీసుకొంది. అందులో భాగంగానే ధర్మ ఫౌండేషన్ 60 లక్షల డాలర్ల విరాళాలను ఇచ్చి నాలుగు కుర్చీలను దక్కించుకుంది. మ్యాచింగ్ గ్రాంట్ కింద యూనివర్శిటీ కూడా ఇంతకంటే ఎక్కువే నిధులే ఇవ్వాల్సి వస్తోంది. ఈ కుర్చీలకు చైర్మన్‌గా వ్యవహరించే వ్యక్తిగానీ, కౌన్సిల్ సభ్యులకుగానీ పదవీ విరమణకు కాలపరిమితి అనేది ఉండదు. ఈ కుర్చీలు సూచించిన అంశాల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ల ప్రక్రియలోకూడా ఈ కుర్చీల ప్రభావం ఉంటుంది.
ఇప్పుడు ఈ నాలుగు చైర్ల వ్యవహారశైలిపై కాలిఫోర్నియా యూనివర్శిటీ విద్యార్థులు, ఫ్యాకల్టీ లీడర్లు ఆందోళన చేస్తున్నారు. పర్శియన్ స్టడీస్, కల్డర్ అండ్ అమెరికా స్టడీస్‌కు సంబంధించి కూడా యూనివర్శిటీల్లో చైర్స్ ఉన్నాయని, వాటికి మత సంస్థలకు ఎలాంటి సంబంధం లేదని ధర్మ ఫౌండేషన్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన ఆలి హో ఒలోమీ అనే 29 ఏళ్ల గ్రాడ్యువేట్ విద్యార్థి తెలిపారు. ధర్మ సంస్థ తమ అకాడమీ విద్యపై ప్రభావం చూపిస్తోందని ఆయన ఆరోపించారు. భారతీయ చరిత్ర గురించి అధ్యయనం చేసేందుకు ఏ విద్యార్థికి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ధర్మ సంస్థ సూచిస్తున్న పాఠ్యాంశాల పట్లనే తమకు అభ్యంతరం ఉందని యూనివర్శిటీలో ‘ఫిల్మ్ అండ్ మీడియా స్టడీస్’ ఫ్యాకల్టీకి చెందిన ప్రొఫెసర్ క్యాథెరిన్ లియూ చెప్పారు. భారతీయ సంస్కృతి, చరిత్రకు సంబంధించి ‘పెంగ్విన్ ఇండియా’ ప్రచురించిన పుస్తకాలు చదవొద్దని ఆంక్షలు పెట్టడం మరీ దారుణమని అన్నారు.
భవిష్యత్‌లో ధర్మ ఫౌండేషన్‌కు వ్యతిరేకంగా తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థగా చెలామణి అవుతున్న ధర్మ ఫౌండేషన్ అంతర్జాతీయంగా విరాళాలు సేకరిస్తున్న విషయం తెల్సిందే.