సాహసం ఆమె పథం
సింహాలకు బెదరదు.. పులులొచ్చినా కదలదు.. ఏనుగులు వెంటాడినా.. పాములు కాటేసినా.. ఆ ఒక్కటి దక్కేవరకూ చచ్చినా మెదలదు.. అదే.. ఒక పర్‌ఫెక్ట్ పిక్చర్.. దాని కోసం ఎంతకైనా తెగిస్తుంది.. ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది.. షానన్ బెన్సన్(36).. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అంటేనే సాహసంతో కూడిన వృత్తి. అందులోనూ షానన్ ఒకడుగు ముందునే ఉంటుంది.. దక్షిణాఫ్రికాలోని సఫారీల్లో వన్యప్రాణుల మధ్యే తిరుగుతూ వాటిని ఫొటోలు తీస్తుంది.
తనను పలుమార్లు చిరుతలు గాయపరిచాయని.. ఏనుగుల మంద వెంటాడిందని.. పాములు, బల్లులు లాంటివైతే లెక్కనేనన్ని సార్లు కరిచిఉంటాయని షానన్ చెబుతోంది. అయితే.. చేయి కాలనిదే మంచి చెఫ్ కాలేనట్లు.. ఇలాంటివి లేకుండా మంచి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఎలా అవుతామని ప్రశ్నిస్తుంది. ఈ వృత్తిలో ఉన్న థ్రిల్లే తనను ముందుకు నడిపిస్తోందని ఆమె చెబుతోంది.