కరెంటు కష్టాలు ఇక దాదాపుగా తీరినట్లే.. ఎందుకంటారా? ఇంకొన్నేళ్లలో ఇంటి కిటికీలకు బిగించిన అద్దాలే సోలార్ ప్యానెల్స్‌గానూ పనిచేయనున్నాయి కాబట్టి! ఈ రకమైన పారదర్శక ప్యానెళ్లను కొంత కాలంగా తయారు చేస్తున్నా.. వాటి సామర్థ్యం తక్కువ కావడం వల్ల ఇప్పటివరకూ అవి విస్తృత వినియోగంలోకి రాలేదు. అమెరికాకు చెందిన ద నేషనల్ రెన్యుయబుల్ ఎనర్జీ లేబొరేటరీ (ఎన్‌ఆర్‌ఈఎల్) తాజాగా ఈ ఇబ్బందిని కూడా అధిగమించింది. ఈ సంస్థ శాస్త్రవేత్తలు తయారు చేసిన పారదర్శక సోలార్‌ప్యానెళ్లు తనపై పడే సూర్యరశ్మిలో 11 శాతాన్ని విద్యుత్తుగా మార్చడంలో విజయం సాధించాయి. సాధారణ సోలార్‌ప్యానెళ్ల సామర్థ్యం 15 శాతం వరకూ ఉంటుంది.
ఈ స్మార్ట్ సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకుంటే అమెరికా మొత్తమ్మీద వాడే విద్యుత్తులో 80 శాతం అక్కడికక్కడే ఉత్పత్తి చేసుకోవచ్చునని ఈ ప్రాజెక్టులో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త లాన్స్ వీలర్ తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో పారదర్శకంగా ఉండే ఈ ప్యానెల్ ఎండ తాకగానే నలుపు రంగును సంతరించుకుంటుంది. ఫలితంగా భవనం లోపలికి వచ్చే ఎండ తగ్గిపోతుంది. అదే సమయంలో విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుంది. పెరోవ్‌స్కైట్స్ అనే వినూత్న పదార్థం, ఒక పొర కార్బన్‌నానోట్యూబ్‌ల వాడకం ద్వారా వీటి ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment