బాయ్ఫ్రెండ్స్ గిఫ్ట్లమ్మి ఇల్లు కొనేసింది
బుర్రలో విషయం ఉన్నోళ్లు ఎడారిలో సైతం ఇసుక అమ్మగలరు. అతి తెలివి తేటలున్నోళ్లు తిమ్మిని బమ్మిని చేసేసి బతికేస్తుంటారు. చైనాలోని ఓ అమ్మడు ఐఫోన్లతో ఏకంగా ఇల్లు కొనేసింది. బాయ్‌ఫ్రెండ్స్ ఇచ్చిన ఐఫోన్లను అమ్మేసి ఎంచక్కా సొంతిల్లు సమకూర్చుకుంది. ఈ విషయాన్ని ఆమె సహోద్యోగి స్వయంగా చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. చైనాలో ఐఫోన్లు బహుమతిగా ఇచ్చి ప్రేమను వ్యక్తం చేయడం పిచ్చిగా మారిందనడానికి ఈ ఉదంతం అద్దం పడుతోంది. షియోలీ(ఇది అసలు పేరు కాకపోవచ్చు) అనే యువతి తన దగ్గర ఉన్న 20 ఐఫోన్లను ఆన్‌లైన్‌లో అమ్మేసి సుమారు రూ.12 లక్షలు పోగేసింది.
ఈ డబ్బును డౌన్‌పేమెంట్‌గా చెల్లించి ఇల్లు కొనుక్కుంది. షియోలీకి 20 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఆమె సహోద్యోగి ఒకరు ‘తియాన్ యా యి డూ’ బ్లాగ్ ద్వారా ఫ్రౌడ్ ఖియొబా పేరుతో వెల్లడించాడు. వాళ్లందరి నుంచి ఐఫోన్ 7 గిఫ్ట్‌గా ఆమె తీసుకుందని తెలిపాడు. చైనాకు వలసవచ్చిన కుటుంబంలో జన్మించిన ఆమె ముందుచూపుతోనే ఇల్లు కొనుక్కుని ఉండవ చ్చని అభిప్రాయపడ్డాడు. అయితే అమె ఇల్లు కొనుక్కున్న పద్ధతే తనకు నమ్మశక్యంగా లేదని ఆశ్చర్యపోయాడు.
ఈ విషయం గురించి తెలియగానే షియోలీ కొనుక్కున్న ఇల్లు చూడాలని, ఆమె డబ్బు ఎలా కూడబెట్టిందో తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరిచారని వెల్లడించాడు. షియోలీని ఇంటర్వ్యూ చేయడానికి మీడియా వెంటపడింది. అయితే మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించింది. షియోలీ స్టోరీ ‘20 మొబైల్స్ ఫర్ ఏ హౌస్’ హ్యాష్ టాగ్‌తో సోషల్ మీడియాతో పెద్ద ఎత్తున షేర్ చే శారు. కొంతమంది ఆమెను ప్రశంసిస్తే, మరికొంత మంది ఆమెను తిట్టిపోశారు.