చైనా.. గోడపై అద్భుత యోగా
బీజింగ్: చైనాలో యోగా రోజురోజుకీ ప్రాచుర్యం పొందుతోంది. యోగా డేలో భారత్ తర్వాత అత్యధిక ప్రజలు పాల్గొనేది చైనాలోనే అన్న విషయం అందరికీ తెలియదు. యోగా డే ఉండాలనే భారత్ ప్రతిపాదనను సమర్థించిన చైనా ప్రతియేటా అధికారికంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. భారత రాయబార కార్యాలయం, యోగి యోగా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’పై చైనీయులు పలువురు యోగా చేశారు. కొన్ని రకాల ఆసనాలను వేసి యోగా డేకు శ్రీకారం చుట్టారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం చైనా రాజధాని బీజింగ్‌లో వెయ్యి మంది ఔత్సాహికులు యోగా డే కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని పలు నగరాల్లో యోగా డే ఘనంగా నిర్వహిస్తున్నారు. భారత రాయబార కార్యాలయం 20 మంది భారత యువతీయువకులను యోగా రాయబారులుగా చైనాకు ఆహ్వహించిన విషయం తెలిసిందే. వీరు హఠ యోగాలో క్లిష్టమైన ఆసనాలను అక్కడ ప్రదర్శించారు. చైనా యువతలో యోగాపై ఆసక్తిని పెంచడానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు.